
కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ ఏడాది కూడా విద్యార్థులకు తరగతులు ఆలస్యంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్ లైన్ క్లాసులను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు జరుగుతాయని పేర్కొన్నారు. దూరదర్శన్, రేడియో, విధ్యవారధి ద్వారా ఆన్ లైన్ క్లాసులను ప్రసారం చేస్తామని వెల్లడించారు.
ఫిజికల్ క్లాసుల నిర్వహణ విషయంలో జగన్ సర్కార్ అధ్యయనం చేస్తోందని త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 50 శాతం మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. కృష్ణాజిల్లాలోని పెడనలో నాడు నేడు కింద జరిగిన అభివృద్ధి చేసిన స్కూల్ ను చిన వీరభద్రుడు పరిశీలించారు. విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ కూడా కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిస్థాయిలో తగ్గకపోవడం, విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పాఠశాలలు విద్యార్థుల నుంచి కేవలం 70 శాతం ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రెగ్యులరిటీ అండ్ మానిటరింగ్ కమిటీ ఈ ఏడాది ఫీజులను నిర్ణయించనుందని తెలుస్తోంది. కమిటీ నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవని జగన్ సర్కార్ చెబుతోంది.
ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కావడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.