ప్రతి సంవత్సరం ఐదో తరగతి చదువుతూ వచ్చే సంవత్సరం ఆరో తరగతిలో చేరే విద్యార్థుల కోసం జవహర్ నవోదయాల్లో నోటిఫికేషన్ విడుదలవుతుందన్న సంగతి తెలిసిందే. జవహర్ నవోదయాల్లో ఎంపికైన విద్యార్థులకు ఆరో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు ఉచితంగా విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది. తాజాగా దేశంలో ఉన్న ఉన్న నవోదయ విద్యాలయాల్లో చేరడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
సాధారణ విద్యాలయాలతో పోల్చి చూస్తే నవోదయ విద్యాలయాల్లో అత్యున్నత స్థాయి ప్రమాణాలతో బోధన ఉండటం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను నవోదయాల్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతుంటారు. దేశంలో మొత్తం 661 నవోదయ విద్యాలయాలు అందుబాటులో ఉండగా వాటిలో 24 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ విద్యాలయాల్లో చేరాలంటే ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్టు రాయాల్సి ఉంటుంది.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ విద్యాలయాలకు ఎంపికవుతారు. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒకసారి మాత్రమే ఈ పరీక్ష రాసే అవకాశం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో చదివిన 3, 4, 5 తరగతుల విద్యార్థులకు 75 శాతం, ఇతర ప్రాంతాలకు చెందిన 25 శాతం మందికి గురుకుల విద్యాలయాల్లో అవకాశం కల్పిస్తారు. రిజర్వేషన్ల ప్రకారం ఈ సీట్లను భర్తీ చేస్తారు.
2008 సంవత్సరం మే నెల ఒకటో తేదీ నుంచి 2012 సంవత్సరం ఏప్రిల్ నెల 30వ తేదీ మధ్య జన్మించిన వాళు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. https://navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 2021 సంవత్సరం ఏప్రిల్ నెల 10వ తేదీన పరీక్షకు హాజరు కావాలి.