
దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి విద్యారంగంపై, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. చాలామంది విద్యార్థులు కెరీర్ కు ఉపయోగపడే కోర్సులు శిక్షణ తీసుకోవాలని ఉన్నా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇదే సమయంలో టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విద్యార్థులకు అత్యున్నత విద్యా ప్రమాణాలతో, టెక్నాలజీతో కూడిన శిక్షణ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) తో ఒప్పందం కుదుర్చుకుని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధమైంది.
క్లౌడ్. డేటా సైన్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిమాండ్ ఉన్న కోర్సులను విద్యార్థులకు, అధ్యాపకులకు శిక్షణ ఇచ్చి వాళ్లను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు మైక్రోసాఫ్ట్ కృషి చేస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం విద్యార్థులు, అధ్యాపకులు ఏఐసీటీఈ ఇ -లెర్నింగ్ పోర్టల్ – ఈఎల్‌ఐఎస్ ద్వారా 1500 కోర్సు- మాడ్యూల్స్ ను ఉచితంగా శిక్షణ తీసుకునే అవకాశాలు ఉంటాయి.
మైక్రోసాఫ్ట్ కు చెందిన మైక్రోసాఫ్ట్ లెర్న్, ఏఐసీటీఈకి చెందిన ఈఎల్‌ఐఎస్ ప్లాట్‌ఫామ్ తో అనుసంధానం చేసి విద్యార్థులు సొంతంగా కోర్సులు నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న విద్యార్థులు ‘మైక్రోసాఫ్ట్ అజూరే’ సహాయంతో యాప్స్ తయారు చేయడం, బిగ్ డేటా అనాలసిస్ లాంటి విభాగాల్లో కూడా పని చేయవచ్చు. మైక్రోసాఫ్ట్ లైవ్ వెబినార్ ద్వారా విద్యార్థులు సొంతంగా నేర్చుకునే అవకాశాలను కల్పిస్తోంది.
మైక్రోసాఫ్ట్ ఆర్థిక స్థోమత లేని విద్యార్థుల కొరకు విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవటాన్ని సులభతరం చేయడంతో పాటు మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్ వోచర్స్ ను స్పాన్సర్ చేస్తోంది. మైక్రోసాఫ్ట్ లెర్న్ ఫర్ ఎడ్యుకేటర్స్ ప్లాట్‌ఫాం ఉపాధ్యాయులకు కావాల్సిన సమాచారం అందిస్తుంది.