Siddhartha Ram Kumar UPSC: సివిల్ సర్వీస్ కు ఎంపికవ్వడం అంటే అంత సులభం కాదు. దేశవ్యాప్తంగా లక్షల మంది పోటీ పడుతుంటారు. ప్రిలిమ్స్ రాయాలి. అందులో ఎంపిక కావాలి. మెయిన్స్ అనే పరమపద సోపానాన్ని దాటాలి. ఇంటర్వ్యూ లో నెగ్గాలి. అప్పుడే సివిల్స్ లో ర్యాంక్ సాధ్యమవుతుంది. అయితే ఇన్ని కష్టాలను దాటుకొని కొలువులు సాధించే వారు వందల్లోనే ఉంటారు. సంవత్సరాల పాటు కష్టపడి చదివితేనే దేశానికి సేవ చేసే భాగ్యం కొంతమందికే దక్కుతుంది. పైగా లక్షలాదిమంది పోటీపడే సివిల్స్ లో టాప్ -4 ర్యాంకు సాధించడం అంటే మామూలు విషయం కాదు. కానీ అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.. కేరళ రాష్ట్రానికి చెందిన సిద్ధార్థ రామ్ కుమార్.
సిద్ధార్థ రామ్ కుమార్ స్వస్థలం కేరళ. ఉన్నత చదువులు చదివిన అతడు చిన్నప్పటినుంచే సివిల్ సర్వెంట్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ దిశగానే తన చదువును కొనసాగించాడు. చదువు పూర్తయిన తర్వాత సివిల్స్ సాధన మొదలుపెట్టాడు. అలా ఫస్ట్ అటెంప్ట్ లో ఐపీఎస్ కు ఎంపిక అయ్యాడు. అయితే కుటుంబ సభ్యులు ఎలాగూ ఐపీఎస్ అయ్యాడు కాబట్టి.. ఇక దాంతోనే సంతృప్తి చెందుతాడని భావించారు. కానీ సిద్ధార్థ రామ్ కుమార్ అలా చేయలేదు. ఐపీఎస్ కు ఎన్నికైన తర్వాత ప్రస్తుతం ఆతను హైదరాబాదులో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణలో ఉంటూనే సివిల్స్ వైపు గురి పెట్టాడు.. రోజుకు 8 నుంచి 10 గంటల వరకు ప్రిపరేషన్ కొనసాగించాడు. సొంత నోట్స్ తో పాటు సీనియర్ల సలహాలు తీసుకున్నాడు.. అలా సివిల్స్ లో టాప్ -4 ర్యాంక్ సాధించాడు.
గతంలో సివిల్స్ రాసినప్పుడు చేసిన పొరపాట్లకు ఈసారి తావు ఇవ్వకుండా.. సిద్ధార్థ రామ్ కుమార్ కచ్చితత్వంతో చదివాడు. ఆంత్రో పాలజిని సబ్జెక్టుగా ఎంచుకొని అహోరాత్రాలు శ్రమించాడు. చివరికి సివిల్స్ ర్యాంక్ సాధించాడు. అయితే ఆయన సివిల్స్ ర్యాంక్ సాధించిన విషయం టీవీలు, పేపర్లలో చూసినప్పుడే తెలిసిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే సిద్ధార్థ రామ్ కుమార్ తాను సివిల్స్ కు మళ్ళీ ప్రిపేర్ అవుతున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదు. మొత్తానికి ఐపీఎస్ ట్రైనింగ్లో ఉండుకుంటూనే ఐఏఎస్ సాధించిన సిద్ధార్థ రామ్ కుమార్ పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సిద్ధార్థ రామ్ కుమార్ నాల్గవ ర్యాంక్ సాధించిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం శుభాకాంక్షలు తెలిపింది.