NEET PG Entrance Exam 2024: వైద్య విద్య కోసం గతంలో రాష్ట్రల వారీగా ప్రవేశ పరీక్షలు జరిగేవి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష ఉండాలని నిర్ణయించింది. ఇందుకు మెజారిటీ రాష్ట్రాలు కూడా అంగీకరించాయి. దీంతో నీట్ పేరుతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూపీ, పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించిన నీట్ యూజీ పరీక్ష పూర్తయింది. ఫలితాలు కూడా జూన్ 3న ప్రకటించింది. అయతే ఫలితాల్లో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం మొన్నటి వరకు కుదిపేసింది. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. సుదీర్ఘ విచారణ తర్వాత నీట్ యూపీ రద్దు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ క్రమంలో నీట్ పీజీ పరీక్షపై సందిగ్ధం నెలకొంది. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థులు కోరారు. దీనిపై కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదాకు కోర్టు నిరాకరించింది. ఈ మేరకు నీట్-పీజీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పరీక్షను వాయిదా వేసి విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టలేమని వ్యాఖ్యానించింది.
ఆగస్టు 11న పరీక్ష..
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించే నీట్-పీజీ పరీక్ష ఆగస్టు 11న (ఆదివారం) జరగనుంది. అయితే దీనిని వాయిదా వేయాలని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు మనోజ్ మిశ్రా, జేబీ పార్దివాలాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు రోజుల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. ఈ సమయంలో వాయిదా వేయాలని ఆదేశించలేమని పేర్కొంది. ‘ఇలాంటి పరీక్షలను మనం ఎలా వాయిదా వేయగలం? ఈ మధ్యకాలంలో పరీక్షను వాయిదా వేయమని అడుగుతూ పిటిషన్లు వేస్తున్నారు. ఇది పరిపూర్ణ ప్రపంచమేమి కాదు. మేము విద్యా నిపుణులం కాదు.. రెండు లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. కొంతమంది అభ్యర్థులు వాయిదా వేయాలని కోరినందుకు దీనిని రీ షెడ్యూల్ చేయాలని అనుకోవడం లేదు. పరీక్షను వాయిదా వేయడం ద్వారా రెండు లక్షల విద్యార్థులు, 4 లక్షల మంది తల్లిదండ్రులు ప్రభావితమవుతారు. ఈ పిటిషన్ల కారణంగా మేము విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో నెట్టివేయలేం’ అని కోర్టు అభిప్రాయపడింది.
లీకేజీ ఆరోపణలు లేవు..
నీట్ పీజీ పరీక్షలో ఇప్పటివరకు పేపర్ లీకేజీ ఆరోపణలు రాలేదు. కానీ నీట్- యూజీ 2024 పరీక్షలో అవకతవకలు జరిగినట్లు దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీట్ పీజీ పరీక్షను సైతం కేంద్రం వాయిదా వేసింది. తొలుత జూన్ 23న నిర్వహించాల్సి ఉండగా తాజాగా ఆగస్టు 11కు వాయిదా వేసింది. ఈమేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.