https://oktelugu.com/

TSPSC Group 1: గ్రూప్‌–1 మెయిన్స్‌ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. ఉచితంగా శిక్షణ.. స్టైఫండ్‌ కూడా..

TSPSC Group 1: తెలంగాణలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ క్వాలిఫై అయి.. మెయిన్స్‌కు ఎంపికైన బీసీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ నిర్ణయించింది. ఇందుకు ఈ నెల 22 నుంచి ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 11, 2024 / 03:02 PM IST

    Good News for TGPSC Group-1 Mains Candidates

    Follow us on

    TSPSC Group 1: తెలంగాణలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ఫలితాలు ఇటీవలే వెలువడ్డాయి. 1:50 ప్రాతిపదికన ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన విద్యార్థులు మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గ్రూప్‌–1 మెయిన్స్‌ అభ్యర్థులకు కిరాక్‌ డీల్‌ అందుబాటులోకి వచ్చింది. ఉచితంగా శిక్షణ ఇవ్వడంతోపాటు నెలనెలా స్టైఫండ్‌ కూడా పొందే అవకాశం వచ్చింది. గ్రూప్‌–1 మెయిన్స్‌ రాయబోయే అభ్యర్థులు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. అయితే ఈ బెనిఫిట్‌ అందరికీ అందుబాటులో ఉండదు. కొందరికే ఈ ప్రయోజనం లభిస్తుంది.

    తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌..
    తెలంగాణలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ క్వాలిఫై అయి.. మెయిన్స్‌కు ఎంపికైన బీసీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ నిర్ణయించింది. ఇందుకు ఈ నెల 22 నుంచి ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో మెయిన్స్‌ కోచింగ్‌ తీసుకోవాలనుకుంటున్న నిరుద్యోగులకు ఊరట లభిస్తుంది. ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లలో భారీగా డబ్బులు పెట్టి శిక్షణ తీసుకోలేని పేద విద్యార్థులకు ఇది వరంగా భావించాలి.

    రెండే కేంద్రాల్లో శిక్షణ..
    తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం సెంటర్లలో 75 రోజులపాటు ఈ ఉచిత గ్రూప్‌–1 మెయిన్స్‌ కోచింగ్‌ ఇస్తారు. కోచింగ్‌ పూర్తయ్యే వరకూ నెలనెలా ఎంపికైన విద్యార్థులకు రూ.5 వేల స్టైఫండ్‌ కూడా ఇస్తామని బీసీ స్టడీ సర్కిల్‌ తెలిపింది. ఇందుకు అభ్యర్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 5 లక్షల లోపు మాత్రమే ఉండాలి.

    దరఖాస్తుల స్వీకరణ..
    ఇక గ్రూప్‌–1 ప్రీ కోచింగ్‌ కోసం జూలై 11 నుంచే దరఖాస్తులు స్వీకరిస్తుంది. జూలై 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆర్హత, ఆసక్తి ఉన్న అబ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. https://tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు చేసుకోచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతోపాటు స్టైఫండ్‌ మంజూరు చేస్తారు. గ్రూప్‌–1 జాబ్‌ కొట్టాలని భావించే అభ్యర్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి.

    శిక్షణ కేంద్రాలు ఇవీ..
    – హైదరాబాద్‌ సైదాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్‌ (రోడ్‌ నం: 8, లక్ష్మీనగర్‌).

    – ఖమ్మంలోని టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఇస్తారు.

    – మరింత సమాచారం కోసం 040–24071188 నంబర్‌లో సంప్రదించాలి.

    1:50 నిష్పత్తిన ప్రిలిమ్స్‌ ఫలితాలు..
    ఇక పోతే తెలంగాణ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.

    గ్రూప్‌–1 మెయిన్స్‌ షెడ్యూల్‌ ఇదీ..
    తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో సివిల్‌ సరెట్లను రిక్రూట్‌ చేయడానికి తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌–1 పరీక్ష నిర్వహిస్తోంది. ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల కావడంతో మెయిన్స్‌ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నోటిఫికేషన్‌లో గ్రూప్‌–1 మెయిన్స్‌ షెడ్యూల్‌ను కూడా టీజీపీఎస్సీ ప్రకటించింది. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్‌–1 మెయిన్స్‌లో ఆరు పేపర్లు ఉంటాయి.

    మూడు భాషల్లో పరీక్ష..
    ఇక మెయిన్స్‌ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్షల్లో జనరల్‌ ఇంగ్లిష్‌ మినహా పేపర్లను అబ్యర్థులే ఎంచుకుంటారు. ఇంగ్లిష్‌ లేదా తెలుగు లేదా ఉర్దూలో సమాధానం ఇవ్వాలి. పేపర్లను ఎంచుకున్న మాధ్యమంలోనే రాయాలి. కొంత భాగం ఇంగ్లిష్‌లో, కొంత భాగం తెలుగులో రాయడానికి వీలులేదు. పేపర్‌ నుంచి పేపర్‌కి లేదా పేపర్‌లోని భాగానికి ఏదైనా మార్పు చేయడానికి అవకాశం లేదు. ప్రతీ పేపర్‌ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. పరీక్ష నిర్వహణకు వారం ముందు హాల్‌టికెట్లు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థుల ఆప్షన్‌ మేరకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష నిర్వహించిన తర్వాత ప్రాథమిక కీ విడుదల చేస్తారు. అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఫైనల్‌ కీ విడుదల చేస్తారు. మెయిన్స్‌లో కూడా ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఫలితాలు ప్రకటిస్తారు.