
ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశంలోని అతి పెద్ద ఐటీ కంపెనీ అయిన ఈ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 40వేల నియామకాలను చేపట్టడానికి సిద్ధమవుతోంది. వివిధ క్యాంపస్ ల నుంచి ఈ నియామకాలు జరగనున్నాయని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం టీసీఎస్ లో ఏకంగా 5 లక్షల మంది పని చేస్తున్నారని తెలుస్తోంది.
గతేడాది 3.60 లక్షల మంది టీసీఎస్ ఎంట్రన్స్ టెస్ట్ కు హాజరు కాగా వారిలో 40వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. టీసీఎస్ సంస్థ తాజాగా ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను టీసీఎస్ సంస్థ ప్రకటించింది. కొత్త ఉద్యోగులను చేర్చుకోవడానికి కరోనా నిబంధనలు అడ్డుగా లేవని సంస్థ ప్రతినిధులు చెబుతుండటం గమనార్హం. టీసీఎస్ గ్లోబల్ హెచ్‌ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ వ్యాపార ఒప్పందాలు పుంజుకున్న తర్వాత నియామకాల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.
కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణియమ్ దేశంలో ప్రతిభకు కొదువ లేదని ఖర్చు గురించి ఆందోళన అవసరం లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు టీసీఎస్ ప్రతి సంవత్సరం కోడ్‌విటా పేరుతో వార్షిక కోడింగ్ పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనడం ద్వారా కూడా ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో సైతం కోడ్ విటా చోటు సంపాదించడం గమనార్హం.
గతేడాది జరిగిన కోడ్‌విటా కాంటెస్ట్ ద్వారా ఏకంగా 3417 మందికి ఉద్యోగం లభించింది. ఎవరైతే ఈ పోటీ ద్వారా ఎంపికవుతారో ఆ విద్యార్థులకు టీసీఎస్ లో ఇంటర్న్ షిప్ చేసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.