GATE RESULT: ఇంజనీరింగ్ అంటే మనదేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఓ వైపు ఆర్థిక మాంద్యం ఉద్యోగులపై ప్రభావం చూపిస్తున్నప్పటికీ.. ఉన్న ఉద్యోగాలు పోతున్నప్పటికీ.. ఇంజనీరింగ్ చదివే వారి సంఖ్య తగ్గడం లేదు. కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ వంటి కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇవి పూర్తి చేసిన తర్వాత ఎంటెక్ చదవడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. వాస్తవానికి గతంలో బీటెక్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడే ప్రాంగణ నియామకాల ద్వారా చాలామందికి ఉద్యోగాలు వచ్చేవి. కానీ గత మూడు సంవత్సరాలుగా జాబ్ మార్కెట్లో ఏర్పడిన అనిశ్చితి వల్ల చాలామంది ఎంటెక్ వైపు వెళ్ళిపోతున్నారు.
దేశంలో ఐఐటి, వివిధ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు “గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(GATE)_2024” ను బెంగళూరు ఐఐఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించారు.. ఈ ఫలితాలు మార్చి 16న విడుదల కానున్నాయి. గేట్_2024 ను ఫిబ్రవరి 3,4,10,11 తేదీలలో దేశంలోని 200 నగరాల్లో బెంగళూరు ఐఐఎస్సీ నిర్వహించింది. పరీక్ష సంబంధించిన జవాబుల కీ ని త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ గేట్ లో సాధించిన స్కోరు ఆధారంగా దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి.. ఆ తర్వాత చూపించిన ప్రతిభ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాయి.
ఇక మనదేశంలో గేట్ ద్వారా ఐఐటి బొంబాయి, గుహ వాటి, ఖాన్ పూర్, ఖరగ్ పూర్, మద్రాస్, రూర్కీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీ హెచ్ డీ వంటి కోర్సుల్లో ప్రవేశం పొందే వీలుంటుంది. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన విద్యాసంస్థలు మాత్రమే కాకుండా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కూడా గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి. ఈ గేట్ స్కోర్ నే ప్రామాణికంగా తీసుకుంటాయి.. ఇంకా కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా గేట్ స్కోర్ ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్షకు సంబంధించి అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను శుక్రవారం విడుదల చేయగా, జవాబుల కీ ని ఫిబ్రవరి 21న విడుదల చేస్తారు. జవాబులకు కీ కి సంబంధించి అభ్యర్థుల నుంచి ఎదురయ్యే అభ్యంతరాలను ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు స్వీకరిస్తారు. అనంతరం మార్చి 16న గేట్ ఫలితాలు విడుదల చేస్తారు. ఫలితాలు విడుదలైన అనంతరం ఒక వారం తర్వాత అంటే మార్చి 23 నుంచి అభ్యర్థులు గేట్ స్కోర్ కార్డులు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు..గేట్ స్కోర్ ఆధారంగా నిర్వహించే కౌన్సిలింగ్ కు అభ్యర్థులు హాజరు కావచ్చు. ఆ తర్వాత తమకు నచ్చిన కాలేజీలో ప్రవేశం పొందవచ్చు.