https://oktelugu.com/

DSC Recruitment 2024 : డీఎస్సీ నియామకాలు ఆలస్యం.. సెప్టెంబర్‌ చివరి వారంలో ప్రారంభించే చాన్స్‌!

తెలంగాణలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయ దినోత్సవం నాటికి పూర్తి చేస్తారని మొదట భావించినా మరింత జాప్యం అవుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 15, 2024 / 10:44 AM IST

    DSC recruitments delayed.

    Follow us on

    DSC Recruitment 2024 : తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్‌ డీఎస్సీ. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ ఇచ్చింది. తర్వాత టెట్‌ వేయాలన్న డిమాండ్‌లో జూన్‌లో టెట్‌ నిర్వహించింది. అదే నెలలో ఫలితాల ప్రకటించింది. జూలై 18 నుంచి ఆగస్టు 05 వరకు డీఎస్సీ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించింది. డీఎస్సీ పరీక్షకు మొత్తం 3,29,897 మంది దరఖాస్తు చేస్తే, 2,79,957 హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రాథమిక కీని ఆగస్టు 13న విడుదల చేసింది. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తుంది. ఈ నెలాఖరు వరకు తుది కీ విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు, డీఎస్సీ పరీక్ష రాసిన వారి వివరాలను క్రోడీకరిస్తున్నారు. రోస్టర్‌ విధానం, వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై అధికారులు దృష్టి పెట్టారు. పరీక్ష ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించిన కారణంగా ఫలితాలను తేలికగా వెల్లడించే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఫైనల్‌ కీ విడుదల చేసిన రోజు.. లేదా మరో రెండు రోజుల్లో ఫలితాలను వెల్లడించే వీలుంది. ఆ తర్వాత వారం రోజుల్లో సీనియారిటీ జాబితాను రూపొందించే యోచనలో ఉన్నారు.

    ఒక్కో పోస్టుకు మగ్గురి ఎంపిక..
    రోస్టర్‌ విధానం, జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించిన డేటా, ఇతర అంశాలన్నీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్‌ పరిధిలోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతీ జిల్లాలోనూ టీచర్‌ పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్‌ పద్ధతిన ఎంపిక చేసి, ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పం పాలని నిర్ణయించారు. జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తుంది. వ్యక్తిగత వివరాల విచారణ నివేదికలను తెప్పించేందుకు అన్ని జిల్లాల పోలీసు అధికారులకు కేంద్ర కార్యాలయం నుంచే జాబితాలు పంపాలని భావిస్తున్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్‌ మూడోవారంలో ముగించి, జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియను నాలుగోవారం నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఒక వేళ ఇది ఆలస్యమైతే అక్టోబర్‌ మొదటి వారంలో నియామక ప్రక్రియ ఉండవచ్చని ఓ అధికారి తెలిపారు. ఏదేమైనప్పటికీ అక్టోబర్‌ చివరి నాటికి నియామక ఉత్తర్వులను అభ్యర్థులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

    ఎస్సీ వర్గీకరణ అమలుపై సందేహాలు..
    కొత్తగా భర్తీ చేసే అన్ని ఉద్యోగ నియామకాల్లో షెడ్యూల్డ్‌ కులాల ఉప వర్గీకరణను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల శాసనసభలో తెలిపారు. అవసరమైతే ఆర్డినెన్స్‌ కూడా తెస్తామన్నారు. అయితే, డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎస్సీ వర్గీకరణపై తీర్పు రాక ముందే ఇచ్చారు. ఈ నియామకాలకు వర్గీకరణ అంశం చేరిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ వర్గీకరణ అంశం ముందుకొస్తే అనుకున్న తేదీల్లో ఉపాధ్యాయ నియామకాలు కష్టమేనని పేర్కొన్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.