Suryapet: సంకల్ప బలం ఉంటే… సాధించలేనిది ఏది లేదని నిరూపిస్తున్నారు నేటి తరం యువత. చిన్నప్పటి నుంచి తల్దిండ్రుల కష్టాన్ని చూసి.. అప్పటి నుంచే ఒక లక్ష్యన్ని నిర్దేశించుకుని.. పెద్దయ్యాక ఎలాంటి కోచింగ్ లేకపోయినా.. ఆర్థిక సమస్యలు అడ్డుగా ఉన్నా.. వాటిని లెక్క చేయకుండా లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. కలలను నిజం చేసుకుంటున్నారు. కన్నావారి ఆకాంక్షను నెరవేరుస్తున్నారు. లక్ష్యాన్ని ఏర్పర్చుకుని అలుపెరుగని పోరాటం చేస్తూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. చదువు పూర్తవకుండానే లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందుతున్నారు. తాజాగా మరో పేదింటి బిడ్డ ప్రతిభకు ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆమె వశమయ్యాయి. ప్రస్తుత రోజుల్లో గవర్నమెంట్ జాబ్స్‌కు ఫుల్ కాంపిటీషన్. ఇలాంటి సమయంలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది సూర్యాపేట జిల్లాకు చెందిన భూక్య మౌనిక. మఠంపల్లి మండలం పాతడోనబండ తండాకు చెందిన భూక్య మౌనిక 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. పేద కుటుంబానికి చెందిన ఆమె హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ.. స్థానిక పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమైంది. ట్యూషన్స్ చెబుతూనే ఆమె తన తలరాతను మార్చుకుంది. పేదింటిలో పుట్టినా.. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నింటినీ దాటుకుని పట్టుదలతో కష్టపడి చదవి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది మౌనిక. కష్టపడితేనే ఫలితం వరిస్తుందని నిరూపించింది.
నాలుగు ప్రభుత్వాలు ఆమె సొంతం..
పేద కుటుంబంలో పుట్టిన మౌనిక.. తన తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలనుకుంది. ఈమేరకు లక్ష్యం నిర్దేశంచుకుని ఒక్కో మెట్లు ఎక్కుతూ వచ్చింది. హైదరాబాద్‌లో ఉంటూ.. తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా.. తానే ట్యూషన్లు చెబుతూ వచ్చే డబ్బులతో హాస్టల్ ఫీజు చెల్లించేది. పుస్తకాలు కొనుక్కుంది. ట్యూషన్లు చెబుతూనే ఉద్యోగాలకు సిద్ధమైంది. ఈక్రమంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్–4 జాబ్స్‌కు ఎలాంటి కోచింగ్ లేకుండానే 6వ ర్యాంక్, టీజీపీఎస్సీ ఫలితాల్లో పంచాయతీరాజ్ ఏఈఈ, 2023లో రైల్వేలో క్యారేజ్, వ్యాగన్, లెవెల్–3లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగాలు సాధించింది.
సర్వత్రా అభినందనల వర్షం..
ట్యూషన్లు చెబుతూ పేదింటి బిడ్డ 4 ఉద్యోగాలు సాధించడంపై సర్వత్రా అభినందనల వర్షం కురుస్తోంది. కుటుంబ సభ్యుల్లో ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వేలు, లక్షలు వెచ్చించి కోచింగ్స్ తీసుకుంటున్నా ప్రభుత్వ ఉద్యోగాలకు నోచుకోలేని వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది ఏ కోచింగ్ లేకున్నా కూడా 4 గవర్నమెంట్ జాబ్స్ సాధించడం హర్షనీయం. మౌనికను ఆదర్శంగా తీసుకుని తమ లక్ష్యాలను చేదించాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటున్నారు.
సర్కారు బడిలో చదివి 4 ప్రభుత్వ ఉద్యోగాలు..
ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించటమే కష్టమైన ఈ రోజుల్లో.. ఈ చదువుల తల్లి ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. చదివింది సర్కారు బడిలోనే అయినా.. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా.. ఎక్కడా తనలోని ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ట్యూషన్లు చెబుతూ తన కొలువుల కలను సాకారం చేసుకుంది. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన చింతల తులసి.
పోటీ ప్రపంచంలో..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు సాదించడం కష్టంగా మారింది. దీంతో ఉన్నత చదువులు చదివిన చాలా మంది మంచి ఉద్యోగం సాధించాలని అనుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగానికి డిమాండ్ భారీగా ఉంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తమ కలల కొలువు సాధన కోసం అనునిత్యం అలుపెరుగక శ్రమిస్తారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి చదువుతుంటారు. అయితే ఉద్యోగ వేటలో అందరూ సక్సెస్ కాలేరు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒకటికి రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే కానీ ప్రభుత్వ ఉద్యోగం రాని పరిస్థితి. నల్గొండ జిల్లాలకు చెందిన ఈ చదువుల తల్లి మాత్రం సత్తా చాటింది. ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది. జిల్లా కేంద్రానికి చెందిన చింతల తులసిది పేద కుటుంబం. తండ్రి చింతల వెంకన్న, లక్ష్మి దంపతుల చిన్నా చితక పనులు చేస్తూ పిల్లల్ని చదవించారు. మూడో సంతానం అయిన తులసి ఆర్థిక ఇబ్బందులతో చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను పూర్తి చేసింది. జేఎన్‌టీయూహెచ్‌లో బీటెక్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా.. ఉండే తులసి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా రెండేళ్లుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గత రెండేళ్ల కాలంలోనే ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.
సాధించిన ఉద్యోగాలు..
గతంలో గ్రూప్–4 ఉద్యోగంతోపాటు పాలిటెక్నిక్ లెక్చరర్ కొలువులు సాధించగా.. ఈ ఏడాది ఏప్రిల్ 24న ఏఈ, ఆగస్టు 2న ఏఈఈ ఉద్యోగాలు సైతం సొంతం చేసుకుంది. గ్రూప్–1 సాధించటమే లక్ష్యంగా పెట్టుకున్న తులసి. గ్రూప్–4, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలు వచ్చినా వాటిని వదులుకుంది. తాజాగా ఏఈఈ, ఏఈ ఉద్యోగాలు కూడా సాధించగా.. ఏ ఉద్యోగంలో జాయిన్ అయ్యే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. ఉద్యోగ ప్రయత్నంలో తాను అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చింతల తులసి వెల్లడించారు. ఏఈఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఫైనాన్షియల్ చాలా ఇబ్బందులు పడినట్లు చెప్పారు. స్థానికంగా ఉండే పిల్లలకు ట్యూషన్లు చెప్పగా వచ్చిన డబ్బులతో స్టడీ మెటీరియల్ కొనుగోలు చేయటంతోపాటు హాస్టల్ ఫీజు కట్టానని తెలిపింది. గ్రూప్ –1 ఉద్యోగం సాధించటమే తన లక్ష్యమని చింతల తులసి వెల్లడించింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More