కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా తాజాగా ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలో మే నెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ నుంచి షెడ్యూల్ ను విడుదల చేస్తూ ప్రకటన వెలువడింది. మే 5వ తేదీన ప్రారంభమైన పరీక్షలు మే నెల 23వ తేదీ వరకు జరగనున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ఇంటర్ విద్యార్థులకు క్లాసులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గడం, రాష్ట్రంలో 200 లోపే కరోనా కేసులు నమోదవుతూ ఉండటం వల్ల ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్ ద్వారా తరగతులు జరుగుతున్నాయి. మే 5వ తేది నుంచి మే 22వ తేదీ వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనుండగా మే 6వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు అధికారి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా పరీక్షలు జరుగుతాయని అన్నారు.
కరోనా వ్యాప్తి జరగకుండా అన్ని చర్యలు చేపట్టి అధికారులు పరీక్షలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. కరోనా వల్ల ఇంటర్ సిలబస్ 30 శాతం తగ్గిన సంగతి తెలిసిందే. 70 శాతం సిలబస్ తోనే ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 108 పనిదినాలు విద్యార్థులకు తరగతులు జరగనున్నాయని సమాచారం. ఇంటర్ విద్యార్థులకు జనవరి 18 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కాగా మే 4వ తేదీ వరకు తరగతులు జరగనున్నాయి.
విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మార్చి నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 24వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని సమాచారం. మార్చి 24వ తేదీన ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష మార్చ్ 27వ తేదీన పర్యావరణ విద్య పరీక్ష జరగనున్నాయి.