SSC Exam: పదో తరగతి పరీక్షల్లో తెలంగాణ విద్యాశాఖ గతేడాది నుంచి కీలక మార్పులు చేసింది. గతంలో ఆరు పేపర్లు.. 11 పరీక్షలు ఉండేవి. కరోనా తర్వాత పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. ఆరు పేపర్లు.. ఏడు రోజుల పరీక్షలు నిర్వహిస్తోంది. సైన్స్ పరీక్షలో అంతర్భాగమైన భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పేపర్లు వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తున్నారు. మిగతా అన్ని పేపర్లు ఒక రోజే నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది అదే విధానం..
ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలు గతేడాది తరహాలోనే నిర్వహిస్తున్నారు. మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మార్చి 26న భౌతిక శాస్త్రం, మార్చి 28న బయాలజీ పరీక్ష ఉండనున్నాయి.
సమయం తగ్గింపు..
ప్రభుత్వం పదో తరగతిలో ప్రతీ పరీక్షకు 3 గంటల సమయం కేటాయించింది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సోషల్ పరీక్షలు మూడు గంటల పాటు జరుగనున్నాయి. సైన్స్ పరీక్ష రెండు రోజులు జరుగనున్న నేపథ్యంలో భౌతిక శాస్త్రానికి గంటన్నర, జీవశాస్త్రానికి గంటన్నర సమయాన్ని విద్యాశాఖ కేటాయించింది. దీంతో మార్చి 26న నిర్వహించే భౌతిక శాస్త్రం పరీక్ష ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు, 28న జీవశాస్త్రం పరీక్ష కూడా ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. పార్ట్ బీ పేపర్‌ను చివరి 15 నిమిషాల ముందు అంటే ఉదయం 10:45 గంటలకు ఇస్తారు.
ఫలితాలు ఒకే పేపర్‌గా..
భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలు వేర్వేరుగా నిర్వహించినా పరీక్ష ఫలితాలు మాత్రం రెండు పేపన్లు కలిపే ప్రకటిస్తారు. రెండు పేపర్లు కలిసి 80 మార్కులు ఉంటాయి. ఇంటర్నల్ మార్కులు 20 ఉంటాయి. అంటే భౌతిక శాస్త్రానికి 40 మార్కులు, జీవశాస్త్రానికి 40 మార్కులు ఉంటాయి.