https://oktelugu.com/

TS DSC Notification: మార్చి 4 నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ.. ఫీజు ఎంతంటే..

తాజా ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా పోస్టుల రిక్రూట్‌మెంట్‌కు మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 4న విద్యాశాఖ వెబ్‌సైట్‌ https://schooledu.telangana.gov.in లో నోటిషికేషన్‌ అందుబాటులో ఉంచుతారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 29, 2024 / 03:32 PM IST
    Follow us on

    TS DSC Notification: తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 29 ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 28న రద్దు చేసిన ప్రభుత్వం 24 గంటలు గడవక ముందే 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ అధికారులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి నోటిఫికేషన్‌ ఇచ్చారు.

    ఈ పోస్టుల భర్తీ..
    తాజా నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, లాంగ్వేజ్‌ పండిత్‌లు, ఫిజికల్‌ ఎడ్యేకేషన్‌ టీచర్లు, ప్రైమరీ లెవల్‌లో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తారు. ఇందుకు ప్రభుత్వం జీవో 96 విడుదల చేసింది. గత నోటిఫికేషన్‌ రద్దు చేసి అదనపు పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ ప్రకటించారు.

    వాళ్లు దరఖాస్తు చేసుకోవద్దు..
    తాజా ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా పోస్టుల రిక్రూట్‌మెంట్‌కు మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 4న విద్యాశాఖ వెబ్‌సైట్‌ https://schooledu.telangana.gov.in లో నోటిషికేషన్‌ అందుబాటులో ఉంచుతారు. జిల్లాలా వారీగా ఖాళీల వివరాలు కూడా అదేరోజు ప్రకటిస్తారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. గతేడాది విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారు తాజా నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

    ఫీజు రూ.1,000
    అప్లికేషన్‌ ప్రాసెసింగ్, రాత పరీక్ష కోసం చెల్లించాల్సిన ఫీజును ప్రభుత్వం రూ.1,000గా నిర్ణయించింది. వేర్వేరు పోస్టులకు పరీక్ష రాసేవారు ఫీజు వేర్వేరుగా రూ.1,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ప్రతీ పోస్టుకు దరఖాస్తు వేరుగా ఇవ్వాలి.

    ఫీజు చెల్లింపు ఇలా..
    మార్చి 4న నోటిఫికేషన్‌ వస్తుంది. విద్యాశాఖ వెబ్‌సైట్‌లో https://schooledu.telangana.gov.in ఫీజు చెల్లింపు గేట్‌వే లింకు ద్వారా క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు/నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఏప్రిల్‌ 2న ఫీజు చెల్లింపు గడువు ముగుస్తుంది. దరఖాస్తులను ఏప్రిల్‌ 3 వరకు స్వీకరిస్తారు. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 46 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. బీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకే 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.

    ఆన్‌లైన్‌లో పరీక్ష..
    డీఎస్సీ–2024 ఉద్యోగాల భర్తీకి కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో 11 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 1) మహబూబ్‌నగర్, 2) రంగారెడ్డి, 3) హైదరాబాద్, 4) మెదక్, 5) నిజామాబాద్, 6) ఆదిలాబాద్, 7) కరీంనగర్, 8) వరంగల్, 9) ఖమ్మం, 10) నల్గొండ మరియు 11) సంగారెడ్డి జిల్లాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దరఖాస్తు సమయంలోనే పరీక్ష కేంద్రాల ప్రాధాన్యత క్రమాన్ని సమర్పించాలి. కేంద్రాలకు కేటాయింపు ఆయా తేదీల్లో జరిగే పరీక్ష, సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.