Homeసంపాదకీయంసూయిజ్ కాల్వ‌లో ఇరుక్కున్న ఓడ‌ న‌ష్టం భ‌రించాల్సింది మీరే..!

సూయిజ్ కాల్వ‌లో ఇరుక్కున్న ఓడ‌ న‌ష్టం భ‌రించాల్సింది మీరే..!

Suez Canal
ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌ధాన స‌ముద్ర మార్గాల్లో సూయ‌జ్ కాలువ ఒక‌టి. ఈ మాన‌వ నిర్మిత ప్రాంతం మీదుగానే.. భారీ నుంచి అతి భారీ నౌక‌లు ప్ర‌యాణిస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ఐదు రోజుల క్రితం ‘ఎవ‌ర్ గివెన్‌’ అనే భారీ కంటెయినర్ షిప్.. చైనా నుంచి నెదర్లాండ్స్ కు పయనమైంది. అయితే.. సముద్రంలో పెనుగాలులు వీచడంతో కాలువ‌లోనే అడ్డం తిరిగి ఇరుక్కుపోయింది. ఈ నౌక‌ను స‌రైన మార్గంలోకి తిప్పేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. కానీ.. ఎప్పుడు పూర్త‌వుతుందో తెలియ‌ట్లేదు. ఈనౌక అందులో ఉన్న గూడ్స్ తో క‌లిసి దాదాపు 2 ల‌క్ష‌ల 20 వేల ట‌న్నుల బ‌రువు ఉంటుంద‌ని అంచ‌నా.

400 మీట‌ర్ల పొడ‌వు, యాభై తొమ్మిది మీట‌ర్ల వెడ‌ల్పు ఉన్న ఈ అతిభారీ నౌక సూయ‌జ్ కాలువ‌కు అడ్డంగా తిర‌గ‌డంతో ప్ర‌యాణాలు ముందుకు సాగ‌ట్లేదు. ఎక్క‌డి నౌక‌లు అక్క‌డే ఆగిపోయాయి. బుధ‌వారం నాటికి దాదాపు 40 కార్గో షిప్పుల్లో మ‌రో 24 చ‌మురు ట్యాంక‌ర్లు అటూ ఇటూ నిలిచిపోయాయి. కార్గో షిప్పుల్లో సిమెంటు, ధాన్యంతోపాటు ఎన్నో ర‌కాల వ‌స్తువులు ఉన్నాయి. ప్ర‌తీ సంవ‌త్స‌రం దాదాపు 19,120 కోట్ల ట‌న్నుల స‌రుకు ఈ మార్గం గుండా ప్ర‌యాణిస్తుంద‌ని అంచ‌నా. ప్ర‌తిరోజూ 10 ల‌క్ష‌ల బ్యారెల్స్ చ‌మురు ఈ దారిలోనే వివిధ‌ దేశాల‌కు స‌ర‌ఫ‌రా అవుతుంది. ఆ విధంగా.. ప్ర‌పంచ వాణిజ్యంలో దాదాపు 12 శాతం ఈ మార్గం గుండానే సాగుతుందని అంచ‌నా.

అయితే.. ఇప్పుడు ఇరుక్కున్న ఈ ఓడ‌ను ప‌క్క‌కు త‌ప్పిస్తే త‌ప్ప‌, వివిధ దేశాల‌కు చెందిన నౌక‌లు ముందుకు సాగే ప‌రిస్థితి లేదు. దానికి ఎన్ని రోజులు ప‌డుతుందో..? ఎప్పుడు సూయ‌జ్ కాలువ ప్ర‌యాణం సాఫీగా సాగుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేకున్నారు. దీనివ‌ల్ల ఆర్థికంగా తీవ్ర న‌ష్టం వా‌టిల్లే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంది.

ఇప్పుడు ఎవ‌ర్ గివెన్ నౌక ఇరుక్కుపోవ‌డం వ‌ల్ల మిగిలిన ఓడ‌ల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. కాబ‌ట్టి.. అవి త‌ర‌లించాల్సిన వ‌స్తువుల స‌ర‌ఫ‌రా ఆగిపోతుంది. అప్పుడు వాటికి డిమాండ్ పెరుగుతుంది. ఫ‌లితంగా ధ‌ర‌లు కూడా పెరుగుతాయి. పెట్రోలియం, లిక్విడ్ నేచుర‌ల్ గ్యాస్ ర‌వాణాకు ఈ కాల్వ చాలా కీల‌కం. మ‌ధ్య‌ప్రాచ్య దేశాల నుంచి యూరప్ వ‌ర‌కూ ఈ కాలువ ద్వారానే ఇంధ‌న స‌ర‌ఫ‌రా అవుతుంది. లాయ‌డ్స్ లిస్ట్ గ‌ణాంకాల ప్ర‌కారం గ‌తేడాది 5,163 ఆయిల్‌ ట్యాంక‌ర్లు ఈ మార్గంలో ప్ర‌యాణించాయి. ఇప్పుడు త్వ‌ర‌గా ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతే ఆయా కంపెనీల‌కు రెండు మార్గాలు ఉంటాయి.

ఒక‌టి, ఎవ‌ర్ గివెన్ నౌక‌ను ప‌క్క‌కు జ‌రిపే వ‌ర‌కూ వేచి ఉండాలి. లేదంటే.. మ‌రో మార్గం ద్వారా స‌రుకును త‌ర‌లించాలి. అయితే.. ఈ రెండు ప‌నుల్లో ఏది జ‌రిగినా.. ప్ర‌పంచానికి భార‌మే. అక్క‌డే ఉంటే.. ముందుగా చెప్పుకున్న‌ట్టు స‌రుకుల కొర‌త ఏర్ప‌డి, ధ‌ర‌లు పెరుగుతాయి. అలా కాకుండా.. రెండోది ఎంచుకుంటే.. ఆ నౌక‌ల‌న్నీ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ప్ర‌యాణించాల్సి ఉంటుంది. అదొక్క‌టే మార్గం ఉంది. ఈ మార్గం ద్వారా స‌రుకుల‌ను త‌ర‌లించాలంటే.. చాలా దూరం అవుతుంది.

అప్పుడు ర‌వాణా వ్య‌యం చాలా పెరిగిపోతుంది. ఆ పెరిగిన ర‌వాణా ఖ‌ర్చును కంపెనీలు స్వ‌యంగా భ‌రించ‌డానికి సిద్ధంగా ఉండ‌వు. కాబ‌ట్టి.. ఆ వ‌స్తువుల‌పై ధ‌ర‌లు పెంచి, జ‌నం ద‌గ్గ‌ర‌నుంచే వ‌సూలు చేస్తాయి. ఆ విధంగా.. ఎక్క‌డో ఈజిస్టులోని సూయ‌జ్ కాల్వ‌లో ఓడ చిక్కుకుపోతే.. ఇక్క‌డ మ‌న జేబులకు క‌త్తెర ప‌డే ప‌రిస్థితి నెల‌కొంది. అన్న‌ట్టూ.. ఈ నౌక చిక్కుపోవ‌డం ద్వారా, వాణిజ్యం మొత్తం నిలిచిపోయినందు వ‌ల్ల ప్ర‌తిరోజూ జ‌రిగే న‌ష్టం ఎంతో తెలుసా..? సుమారు రూ.70 వేల కోట్లు! ఆ నౌక‌ను తొల‌గించే వ‌ర‌కూ ప్ర‌తీరోజు ఈ మొత్తాన్ని క‌లుపుకుంటూ వెళ్లాల్సిందే. మ‌రి, ఆ నౌక ఎప్పుడు ప‌క్క‌కు జ‌రుగుతుందో..? సూయజ్ కాల్వ ట్రాఫిక్ ఎప్పుడు క్లియ‌ర్ అవుతుందో చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular