Krishna Janmashtami 2025: హిందువులు ఘనంగా జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణాష్టమి ఒకటి. శ్రీకృష్ణుడి జననాన్ని సూచించే ఈ పండుగ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా కృష్ణుడిని ప్రత్యేకంగా సేవించే భక్తులకు ఇది చాలా ముఖ్యమైన రోజు. దేశంలోని శ్రీకృష్ణ ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది భాద్రపద మాసంలో కృష్ణపక్షం అష్టమి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది ఆగస్టులో శ్రావణ మాసంలో వచ్చింది. శ్రీ కృష్ణాష్టమి గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాలంటే కొన్ని ప్రత్యేక మైన పనులు చేయాలి. అలా చేస్తే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయని కొందరు పండితులు చెబుతున్నారు. మరి ఏం చేయాలంటే?
Also Read: వచ్చే వారం ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ ఇవ్వనున్న ప్రభాస్.. పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు!
శ్రీకృష్ణాష్టమి రోజు దేవాలయాలను సందర్శించేవారు కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే సాధారణ పూజలు కాకుండా శ్రీ కృష్ణాష్టమి రోజు అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ నిర్వహించుకోవాలని అంటున్నారు. అష్టోత్తర పూజ అంటే 108 పేర్లతో శ్రీకృష్ణుడని పూజించడం. మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడికి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీటిలో ముఖ్యమైన 108 పేర్లను ప్రత్యేకంగా సూచించడం ద్వారా శ్రీకృష్ణుడికి ఎంతో సంతోషంగా ఉంటుందని అంటుంటారు. అయితే అష్టోత్తర పూజలో అష్టోత్తర శత నామావళిని చదవాలి. ప్రతి పేరుతో దేవుడికి పుష్పాలు అందించాలి. ఈ పూజ వల్ల దేవుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా 108 పేర్లతో దేవుడిని పూజించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం, ఇతర సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.
అష్టోత్తర పూజ కంటే మరింత ఫలితం పొందాలని ఆశించేవారు కృష్ణ సహస్రనామ పూజ కూడా చేయవచ్చని అంటారు. సహస్రనామ పూజ అంటే శ్రీకృష్ణుడిని వేయి నామాలతో చేసే పూజ. ఈ పూజలో శ్రీకృష్ణుడికి వేయి నామాలతో ప్రత్యేకంగా పూజలు చేయాలి. ప్రతి పేరుకు ద్రవ్యాలు వేస్తూ పుష్పాలను ఉంచాలి. అంటే కుంకుమ, అక్షింతలు, పుష్పాలు, నైవేద్యాలను సమర్పించాలి. ఈ పూజ చేసే ముందు పసుపుతో మహాగణపతిని తయారు చేసి ఆ పూజ చేసిన తర్వాత సహస్రనామ పూజ చేయాలి. సహస్రనామ పూజ చేయడం వల్ల ఎన్నో రకాల శుభాలు జరుగుతాయని అంటున్నారు. అలాగే పూజ చేసిన వారి ఇంట్లో సంతోషకరమైన వాతావరణ ఉంటుందని చెబుతున్నారు. అప్పటివరకు ఆర్థిక బాధలు ఉన్నవారు ఇకనుంచి అష్టైశ్వర్యాలు కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read: సంతానం కోసం ఆ పూజలు చేయొద్దు.. ఇంట్లోనే ఇలా చేస్తే చాలు..
ఇలా శ్రీకృష్ణాష్టమి రోజు ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల ఎన్నో ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. అయితే ఇవి సాధ్యం కాని వారు ఈ రోజున ప్రత్యేకంగా ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. శ్రీకృష్ణాష్టమి ఆగస్టు 16వ తేదీన రాత్రి పది గంటల 52 నిమిషాల వరకు ఉంది. ఈ సమయం ముగిసిన తర్వాత ఆహార పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు.