Homeజాతీయంఒలింపిక్స్ పతకం.. ఆటగాళ్ల స్వప్నం

ఒలింపిక్స్ పతకం.. ఆటగాళ్ల స్వప్నం

India Medals in Olympics 2021ఒలింపిక్స్ లో ఇండియా తన సత్తా చాటుతోంది. ఇన్నాళ్లు ఒకటి అర పతకాలతో సరిపెట్టుకుని దిగజారిపోయేలా కనిపించిన దేశం ప్రస్తుతం తన ప్రతాపాన్ని చూపిస్తోంది ఓడినా పోరాట పటిమ ప్రదర్శిస్తూ తనలోని క్రీడా నైపుణ్యతలను చూపిస్తోంది. పతకం రాకపోయినా ఆటలో అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. గతంలో చివరి స్థానాల్లో ఉండే భారత్ ప్రస్తుతం ముందు వరుసలోకి దూసుకెళ్తోంది. మన వారి ప్రదర్శన చూసి ఇతర దేశాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత కాలం ఇండియా అంటే జాలి చూపించే వారు నేడు మన ఘనత చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

పతకాల పట్టికలో ఎక్కడో చివరి స్థానంలో ఉండే దేశం క్రీడాకారుల ఫామ్ తో మంచి ర్యాంకు సాధిస్తున్నారు. 1996 ఒలింపిక్స్ లో టెన్నిస్ ల కాంస్య పతకం గెలుచుకుంటే దేశం యావత్తు ఉలిక్కిపడింది. 2000 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధిస్తే సంతోషపడ్డాం. బీజింగ్ ఒలింపిక్స్ లో షూటింగ్ లో స్వర్ణ పతకం సాధించిన అభినవ్ బింద్రా చరిత్ర సృష్టించాడు. దీంతో బింద్రాను స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది పతకాల కోసం తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించుకునేందుకు శిక్షణ తీసుకున్నారు.అప్పటి నుంచి ఇప్పట వరకు ఎంతో ఘనత సాధించామని తెలుసుకోవాలి.

టోక్యో ఒలింపిక్స్ లో భారత ఆటగాళ్ల పోరాట పటిమ చూసిన వారికి ఇట్టే అర్థమైపోతోంది. వారికి భవిష్యత్ ఉందని తెలుస్తోంది. మీరాబాయి చాను, పీవీ సింధు, లవ్లీవా, రవికుమార్ దహియా, హాకీ టీం రజత, కాంస్య పతకాల వరకు వెళ్లడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. మనం స్వర్ణ పతకాలకు తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఓడినా ప్రత్యర్థిపై మనం సాధించిన ప్రదర్శనే కనిపిస్తోంది. అథ్లెటిక్స్ లో మనకు ఇంతవరకు పతకం దక్కకపోయినా ఇప్పుడు ఆ భాగ్యం కూడా కలిసి రావచ్చొనే తెలుస్తోంది. జావెలిన్ త్రో లో కూడా నీరజ్ గ్రూప్ ఏ మ్యాచ్ లో 86.65 మీటర్లకు జావెలిన్ విసిరి ఫైనల్ చేరాడు. పురుషుల హాకీ జట్టు ఇప్పటికే కాంస్య పతకం ఖాయం చేసుకుంది. మహిళల జట్టు కూడా అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తోంది.

రెజ్లింగ్ లో కూడా భారత క్రీడాకారులు తమ ఫోకస్ పెట్టారు. రెజ్లర్ దీపక్ పూనియా 86 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో సెమీస్ కు చేరారు. అదృష్టం కలిసి రాకపోవడంతో వెనకడుగు వేశాడు. కమల్ ప్రీత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మహిళల డిస్కస్ త్రో లో పతకం ఖాయమని ఆశించినా ఫలితం దక్కలేదు. అయితే కమల్ ప్రీత్ భవిష్యత్ లో పతకం సాధించడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఆర్చరీలో కూడా అద్భుత ప్రదర్శన చేసినా పతకం మాత్రం దగ్గరకు రాలేదు. సాంకేతిక సమస్యలతో పతకం రాకుండా పోయిందని తెలిసిందే.

గతంలో భారత్ కు పతకం రావడం గగనమే. ఎంత మంది క్రీడాకారులు వెళ్లినా తెల్ల మొహం వేసుకుని వచ్చే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రతి ఈవెంట్ లోనూ పోటీ ఇచ్చి ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించే స్థాయి మన క్రీడాకారులకు రావడం ఆహ్వానించదగినదే. కేవలం ఉద్యోగాల కోసమే క్రీడలు ఎంచుకునే స్థితి నుంచి దేశం గర్వించే స్థాయికి చేరుకోవడం హర్షించదగినదే. హాకీ అభివృద్ధికి ఒడిశా ప్రభుత్వం చేసిన సాయం ఎవరు మరువలేరు. ఇప్పుడు హాకీ పతకం తీసుకొచ్చిందంటే అది ఒడిశా వల్లే అని అందరు చెబుతున్నారు.

మన దేశంలో క్రీడా సదుపాయాలు మెరుగు పర్చాల్సిన అవసరం గుర్తించాలి. క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలతో పాటు వారికి అధునాతన శిక్షణ ఇప్పిస్తే ఇంకా మెరుగు పడతారు. జనాభా ఎక్కువ ఉన్నా క్రీడా సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు పట్టించుకోవాలి. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించాలి. అప్పుడే ఇంకా రాటుదేలి పతకాల పంట పండిస్తారు. దీని కోసం అహర్నిశలు పాటుపడేందుకు వీలుగా వారిని సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version