ప్రేక్షకుల నాడిని పట్టుకున్నవాడే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాడు. కొరటాల శివకు ఆ నాడి బాగా తెలుసు. మరి నేడు కొరటాల పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొరటాల మనస్తత్వం పై ఓ కథనం. మనుషుల పై ఎంతో ప్రేమ ఉంటే గానీ.. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ అని రాయలేము. తన మొదటి చిత్రం ‘మిర్చి’లో పగ, ప్రతీకారాలతో సాధించలేని దాన్ని, ప్రేమతో సాధించొచ్చు అని తన మనసులో బలమైన నమ్మకం ఉండబట్టే, పేపర్ మీద రాసి కొరటాల ఒప్పించగలిగాడు.
కొరటాలలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. మనిషి తత్వాన్ని బోధిస్తాడు, కానీ, ఎక్కడా క్లాస్ పీకినట్టు ఉండదు. అసలు ఊరి నుంచి చాలా తీసుకున్నాం తిరిగి ఇచ్చేయాలి అనే పాయింట్ కొత్తదేమీ కాదు. కానీ, కొరటాల కథ చూసిన తరువాతే.. ఈ జనరేషన్ కి గ్రామాలను దత్తత తీసుకోవడం అనే ఆలోచన మొదలైంది. ‘శ్రీమంతుడు’కి స్ఫూర్తి కలిగించాడు అంటే.. ఆ స్ఫూర్తి కొరటాలలో ఎంత ఉండి ఉంటుంది. నిజంగా ‘తిరిగి ఇచ్చేయాలి లేదంటే లావైపోతాం’ అని కొరటాల ఊరికే డైలాగ్ రాయలేదు. ఆయన జీవితంలో పాటించే సిద్ధాంతం ఇది.
ఇక తెలుగు సినిమాలో హీరోయిన్ అంటే ఏమిటి ? అందాలను అడ్డు అదుపు లేకుండా ప్రదర్శిస్తూ కుర్రాళ్లను ఆకట్టుకోవాలి అంతేగా. కానీ, కొరటాల హీరోయిన్లు అలా ఉండరు. వాళ్ళు స్వతంత్రంగా జీవించాలనుకునే బలమైన అమ్మాయిలుగా కనిపిస్తారు. స్త్రీల పట్ల కొరటాలకు ఉన్న గౌరవం ఇది. ప్రకృతి ఆరాధకుడు అనే పదం ఎప్పుడైనా విన్నారా ? చాలామంది గొప్పవాళ్ళు ప్రకృతి గురించి చాల గొప్పగా చెప్పారు.
కానీ ‘మొక్కలు, గాలి, నీరు వీటిని కాపాడుకోవడమే మన పని’ అంటూ కొరటాల చెప్పిన తరువాతే కదా, ప్రకృతి ప్రేమికులకు కనువింపు కలిగింది. కొరటాల సంభాషణలు సగటు ప్రేక్షకుడిని ప్రేమలో పడేస్తాయి అని అంటారు. కానీ కాదు. కొరటాల ఆ పాత్రలో ప్రేమలో పడిపోయిన తరువాతే సంబాషణలు పుడతాయి. కాబట్టి, స్వచ్ఛమైన ప్రేమకు పుట్టిన మాటలకూ ఎప్పటికీ ప్రాణం నిలిచే ఉంటుంది. అందుకే కొరటాల మాటలు ప్రత్యేక బాటలు.