‘నేను గానీ.. ఒక్క ఈలగానీ.. వేశానంటే…’ అంటూ ఉంటాడు మాయలోడు సినిమాలో రాజేంద్రప్రసాద్. అన్నట్టుగానే ఈలవేస్తాడు, ఏదో మాయచేస్తాడు. కానీ.. అది జస్ట్ గారడీ తప్ప, వాస్తవం కాదన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత సీఎం కేసీఆర్ కూడా రాజకీయాల్లో ఇదేపద్ధతిన వ్యవహరిస్తుంటారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో మూడో ఫ్రంట్ పేరుతో ఆ మధ్య కేసీఆర్ చేసిన హడావిడి అంతాఇంతా కాదు.
పార్లమెంట్ ఎన్నికల వేళ ‘సారు.. కారు.. పదహారు’ అనే నినాదంతో జనాల్లోకి వెళ్లారు. తెలంగాణలోని 16 సీట్లు గెలిపిస్తే.. ఇక కేంద్రం మెడలు వంచడమే అన్నారు. ఆ తర్వాత జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా ఫలితాలు రావడంతో.. మరోసారి కేంద్రంలోని కాషాయ దళం మీద ఒంటికాలిపై లేచారు. కేంద్రంలో బొంగరం తిప్పడం కాయమని చెప్పారు. కానీ ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి పర్సనల్ గా మోడీ, అమిత్ షాను మీటై వచ్చారు!
ఇటు చంద్రబాబు గురించి చెప్పుకోవాల్సి వస్తే.. మామూలుగా ఉండదు. మాట్లాడితే.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెబుతారు. కేంద్రంలో చక్రం తిప్పిన చరిత్ర అంటారు. గతం నిజమే. కానీ.. వర్తమానం సంగతేంటీ? అంటే సమాధానం కనిపించదు. గతంలో బీజేపీపై బాణం ఎక్కుపెట్టినట్టుగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా.. వెళ్లి మమతను, స్టాలిన్ ను కలిసి వచ్చారు. మనమంతా కలిసి బీజేపీ అంతు చూడాలంటూ మంతనాలు నడిపి వచ్చారు. మాటలు చెప్పి వచ్చారు కానీ.. ఆచరణ ఎప్పుడు? అంటే రేపే అన్నట్టుగా ఉంది పరిస్థితి.
కాంగ్రెస్, బీజేపీ కాకుండా మూడో ఫ్రంట్ కడతామని అంటూ చంద్రబాబు, ఇటు కేసీఆర్ ఇద్దరూ ముచ్చట్లు చెప్పారు. సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉన్నారు. అంతేకాదు.. దానికి నాయకత్వం వహించబోయేది కూడా తామే అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. కానీ.. ఆ ఫ్రంట్ ఎటుపోయిందో.. ఆ ప్రయత్నాలు ఎంత వరకూ వచ్చాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి.
నిజానికి ఈ ఫ్రంట్ ప్రయత్నాలకు ఇప్పుడు చక్కని అవకాశం ఉంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు తమిళనాట, అటు కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు ఇంతకు మించిన మంచి సమయం మరేం ఉంటుంది? చావో రేవో అన్నట్టుగా సాగుతున్న పోరాటంలో మమత సింగిల్ గా బీజేపీని ఎదుర్కొంటున్నారు. అటు తమిళనాట స్టాలిన్ కూడా ఢీ అంటే ఢీ అంటున్నారు. వీరిద్దరికీ బాసటగా కేసీఆర్, చంద్రబాబు నిలిస్తే ఎంత బాగుంటుంది? కానీ.. వీళ్లు ఆపని చేయట్లేదు. కనీసం ఓ స్టేట్ మెంట్ కూడా ఇవ్వట్లేదు. జాతీయ పార్టీలను ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీలకు ఇంతకు మించిన అవకాశం దక్కదనేది విశ్లేషకుల మాట.
నిజంగా.. మూడో ఫ్రంట్ పై చిత్తశుద్ధి ఉంటే.. ఇలాంటి కీలక తరుణంలో వారికి మద్దతు పలకడం ద్వారా జట్టుకట్టడానికి కృషి చేసేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం.. ఎన్నికల సందర్భంలో చేసే రాజకీయ ప్రకటనగానే మూడో ఫ్రంట్ ఉందని అంటున్నారు. అసలైన చిత్తశుద్ది అంటే శరద్ పవార్ ది అని అంటున్నారు. ఎన్సీపీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయన.. బెంగాల్ లో మమత తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి చిత్తశుద్ధిని చూపిచడంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు చంద్రులూ ప్రయత్నించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.