
విశాఖ ఉక్కుకార్మికులకు మంత్రి కేటీఆర్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అవసరమైతే విశాఖ వెళ్లి పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తామని అన్నారు. ఈ నైతిక మద్దతు ఏపీ ప్రజలకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అయితే.. తాజాగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఏపీ డెవలప్ మెంట్ పై కామెంట్ చేశారు. గతంలో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో నాలుగైదు ఎకరాలు కొనేవాళ్లని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని అన్నారు. తెలంగాణలో ఒక ఎకరం.. ఏపీలో రెండు ఎకరాలకు సమానం అయ్యిందని అన్నారు.
ఏపీలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. చాలా మంది వ్యాపారులు అమరావతి తదితరప్రాంతాల నుంచి దుకాణం సర్దేశి, హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారనే ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలుచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఇదేతరహా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వ్యాపారాలను ప్రోత్సహించే క్రమంలో రియల్ ఎస్టేట్ ఓనర్లతో ఈ మధ్య జరిగిన సమావేశంలో ఏపీ అభివృద్ధిని ఉదహరించారు. ‘ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నారుగా?’ అని ఇండైరెక్టుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానాల ద్వారా ఏపీలో అభివృద్ధి పడిపోయిందని పరోక్షంగా చెబుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరి, ఇలా ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు అని చాలా మంది బుర్ర గోక్కుంటున్నారు. చంద్రబాబుతో కయ్యం కొనసాగినప్పటికీ.. జగన్ వచ్చిన తర్వాత పరిస్థితులు సాధారణం అయ్యాయి. కేసీఆర్-జగన్ రిలేషన్ కూడా బాగానే ఉన్నట్టు కనిపించింది. మరి, ఇలాంటి వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారనే సందేహం వ్యక్తమవుతోంది.
అయితే.. తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము అభివృద్ధి బాటలో ఉన్నామని,రాష్ట్రాన్ని డెవలప్ చేశామని చెప్పడానికి, ఏపీని ఉదాహరణగా తీసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటికిమొన్న విడిపోయిన రాష్ట్రాలు కాబట్టి.. జనాల్లో పోలిక సహజంగా ఉంటుంది. కాబట్టి.. ఇలా పోల్చడం ద్వారా తెలంగాణను టీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని చెప్పడానికే ఇలా పోలుస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.