Sita Ramam Movie Review: సినిమా ప్రేమకు అర్థం మారిపోయింది. నాలుగు లిప్ లాక్ సీన్లు, రెండు ఇంటిమేట్ సీన్లు, మొదలు నుంచి తుది వరకు బూతు పదాల వరకు మన దర్శకుల మేథ ఎదిగిపోయింది. కానీ ప్రేమంటే రెండు మనసుల సంఘర్షణ. యుద్ధం భిన్న వ్యక్తుల ఘర్షణ. ప్రేమ వేరు. యుద్దం వేరు. కానీ కొన్నిసార్లు ప్రేమ కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుంది. ఇంకొన్నిసార్లు యుద్ధాల్లోనూ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. ప్రేమ, యుద్ధం ఇవి రెండు కలిస్తేనే “సీతారామం”. ఎవరూ లేని ఓ సైనికుడు దేశంపై చూపించే ప్రేమ.. దేశం మొత్తం మీద ప్రేమను ఒక సైనికుడి పై చూపించే ఓ అమ్మాయి.. వీరిద్దరి మధ్య జరిగిన ప్రణయ ప్రయాణమే ఈ సీతారామం. ఇద్దరి మనుషుల మనసుల హృద్య మైన భావోద్వేగాలను ఎలా చూపిస్తే ప్రేమ పండుతుందో.. ఆ ప్రేమ కోసం వారు పడే ఇబ్బందులను ఎలా తీస్తే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారో అలానే తీశాడు హను రాఘవపూడి. చాలా నెలలుగా వచ్చిన సినిమాలు వచ్చినట్టే తిరిగి వెళుతుంటే.. ప్రేక్షకులు నచ్చేలా తీస్తే ఎలాగైనా వారు థియేటర్లకు వస్తారని నిరూపించాడు. ఇటీవల కాలంలో ఇంత మంచి ఫీల్, సోల్ ఉన్న సినిమా రాలేదు అంటే అతి శయోక్తి కాదేమో.. చాలాకాలంగా హిట్లు లేక బాధపడుతున్న హను రాఘవపుడి.. ఈ సినిమా కోసం మనసుపెట్టి పనిచేశారు. సినిమా మొదలు నుంచి ముగింపు వరకు ప్రతి సన్నివేశం ఒక దృశ్య కావ్యం లాగా ఉంటుంది. అందుకే తెలుగు సినీ పరిశ్రమలో సీతారామం ఒక గొప్ప ప్రణయ కావ్యం లాగా మిగిలిపోతుంది.
-కథ పాకిస్తాన్లో మొదలు
అనగనగనగా పాకిస్తాన్లో ఓ నగరం. తను చేరాల్సిన గమ్యం చేరుకోలేక ఓ ఉత్తరం 20 ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉంటుంది. అది చేరాల్సిన గమ్యం హైదరాబాద్. ఆ లెటర్ సీతామహాలక్ష్మి కోసం లెఫ్టినెంట్ రామ్ రాసింది. దానికి హైదరాబాద్ చేర్చే బాధ్యత ఆఫ్రీన్ (రష్మీక) మీద పడుతుంది. ఈ లెటర్ కనుక హైదరాబాద్ చేర్చకపోతే ఆమె తాతయ్య(సచిన్ ఖేడ్కర్) ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వనంటాడు. అందుకే ఇష్టం లేకపోయినా ఆ ఉత్తరం పట్టుకుని ఆఫ్రిన్ హైదరాబాద్ వస్తుంది. ఈ ప్రయాణంలో ఒక్కొక్కరిని కలుస్తుంది. లెఫ్ట్నెంట్ రామ్ గురించి, సీతా మహాలక్ష్మి గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుంది.
Also Read: Bimbisara Review: రివ్యూ – ‘బింబిసార’
ఈ కథలో రామ్ ఓ అనాథ దేశం తప్ప ఇంకేం తెలీదు. హఠాత్తుగా సీతా మహాలక్ష్మి పేరుతో ఉత్తరాలు వస్తుంటాయి. ప్రత్యుత్తరం రాద్దాం అంటే చిరునామా అసలు ఉండదు. ఆ ఉత్తరాన్ని చదవడం, మరో ఉత్తరం కోసం ఎదురుచూడటం ఇదే రామ్ దినచర్య అయిపోతూ ఉంటుంది. ఇక్కడ కొన్ని కొన్ని సన్నివేశాలు ఆనందం సినిమాని గుర్తుకు తెచ్చేలా ఉంటాయి. ఇలా సాగుతున్న కథలో ఒకరోజు హఠాత్తుగా రామ్ సీతా మహాలక్ష్మి కలుస్తాడు. ఇద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. అది ప్రేమగా మారుతుంది.ఈ తరుణంలోనే ఎంతోచనువుగా ఆమెను అతడు “ఏంటే” అని పిలుస్తాడు. ఒక అడుగు ముందుకేసి “నన్ను పెళ్లి చేసుకుంటావా?” అని అడుగుతాడు. దీనికి సీతామహాలక్ష్మి నుంచి ఎటువంటి సమాధానం ఉండదు. ఇలా సాగిపోతున్న వీరి ప్రణయానికి బ్రేక్ పడుతుంది. అసలు బ్రేక్ ఎందుకు పడింది? వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకున్నారా? ఆ ఉత్తరాన్ని ఆఫ్రిన్ సీతామహాలక్ష్మికి చేరవేసిందా? రామ్ సీతామాలక్ష్మి పెళ్లి చేసుకున్నారా? అసలు ఈ సినిమాకి యుద్ధంతో రాసిన ప్రేమ కథ అని ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టారు ? అనేవి మిగిలిన విషయాలు. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అని ఎందుకు ట్యాగ్ లైన్ పెట్టారో అది ఎందుకనేది ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. యుద్ధం, ప్రేమ అనే పరస్పర విరుద్ధమైన అంశాలను బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు ఈ కథ మొదలు పెట్టాడు. వాస్తవానికి ఈ కథ యుద్ధం తోనే మొదలవుతుంది. పాకిస్తాన్లోని తీవ్రవాదులు కాశ్మీర్లో ఎలాంటి విధ్వంసానికి పూనుకున్నారనే కోణంలో కథ చెప్పడం హను కే చెల్లింది. ఒక్కోసిన్ బాగానే ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లో మాత్రం సీత, రామ్ ప్రేమ కథ ఎలా మొదలవుతుందనే ఆసక్తి అంతకంతకు పెరుగుతుంది. యుద్ధ నేపథ్యానికి, కాశ్మీర్ అల్లర్లకి అంత ప్రాధాన్యం దర్శకుడు ఎందుకు ఇచ్చాడో అనిపిస్తుంది. కానీ ఆ వేవ్ లెంగ్త్ కు దర్శకుడు చివర్లో ఇచ్చిన జస్టిఫికేషన్ చప్పట్లు కొట్టి పిస్తుంది.
-ఉత్తరాలు రాయడంతో మొదలు..
ఈ సినిమా సోల్ ఉత్తరాలు రాయడంతోనే ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి ఒక్కో సన్నివేశం కథలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేస్తుంది. సీతను వెతుక్కుంటూ రామ్ వెళ్లడం, వారిద్దరి జర్నీ పోయటిగ్గా ఉండటం, రామ్, సీత మాట్లాడుకుంటుంటే పోయెట్రిల్లా కనిపించడం, వాళ్ల ఉత్తర ప్రత్యుత్తర లాగానే కనిపిస్తాయి. వెన్నెల కిషోర్, సునీల్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి కాస్త కామెడీ అతికిద్దామని దర్శకుడు ప్రయత్నించినా అదంతా సఫలం కాలేదు. వాళ్ల గెటప్ లు కూడా అంత బాగా ఉండవు. అది మినహా ఫస్టాఫ్లో వంక పెట్టడానికి ఏ లోపాలు కనిపించవు. ఒక దశలో పాటలు ఎప్పుడొస్తాయో ఎప్పుడు పోతాయో తెలియనంతగా ప్రేక్షకులు కథలో లీనమవుతారు. ఇలా జరుగుతున్న కొద్దీ ఇంటర్వెల్ కి వచ్చేసరికి దర్శకుడు అనుకోని ట్విస్ట్ ఇస్తాడు. ఇక్కడే రామ్ సీత ప్రేమకు బ్రేక్ పడుతుంది. ఇందులోనూ కీలకమైన మలుపులు రాసుకొని మరింత ఆసక్తికరంగా దర్శకుడు కథను మలిచాడు. సెకండ్ హాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది పీక్స్ కి వెళ్తాయి.
-ప్రేమ పెరుగుతుంది
సీత నేపథ్యం తెలిశాక ఆ పాత్ర పై ప్రేక్షకుడికి మరింత ప్రేమ పెరుగుతుంది. తనకు ఎవరైతే ఉత్తరాలు రాశారో వాళ్ళందర్నీ వెళ్లి కలవడం, చివర్లో ఓ చెల్లి దగ్గరికి వెళ్లి అన్నలా తన బాధ్యత తీసుకోవడం చాలా హృద్యంగా అనిపిస్తుంది. ఈ కథకు అత్యంత కీలకమైంది విష్ణుశర్మ పాత్ర. పైకి సాదాసీదాగా కనిపించినా ఈ పాత్ర కథ నడుస్తున్న కొద్దీ భిన్న కోణాలు చూపిస్తుంది. ఈ పాత్ర వల్ల కథ స్వరూపమే మారిపోతుంది. దేశం కోసం ప్రాణాన్ని, ప్రేమని త్యాగం చేస్తున్నప్పుడు రామ్ ఎంత గొప్పగా కనిపిస్తాడో.. అతని కోసం ఎదురుచూసి చూసి బతికేసే సీతను చూసినప్పుడు కూడా అంతే గొప్పగా అనిపిస్తుంది. కథానాయకుడు, కథానాయక పాత్రలను దర్శకుడు బాగా ప్రేమించినప్పుడే ఇట్లాంటి సినిమాలు పుడతాయి కాబోలు. ఆఫ్రిన్ పాత్రకు దర్శకుడు ఇచ్చిన ముగింపును చూస్తే మెచ్చుకోకుండా ఉండలేం. అసలు ఆ పాత్రను అలా ముగించడం వల్లనే ఈ కథకు మరింత అందం వచ్చింది. చివరి 30 నిమిషాలు అయితే ఈ సినిమా కథ మరో స్థాయికి వెళ్తుంది. ” ఇప్పుడు మీరు క్షమాపణలు అడగకపోతే కచ్చితంగా చనిపోతాను. ఇంత బాధను మీరు ఇన్నేళ్లు ఎలా మోస్తున్నారు” అని అఫ్రీన్ చెబుతున్నప్పుడు ఎవరికైనా సరే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఓ ప్రేమ కథకు అది కూడా యుద్ధంతో ముడిపడిన ప్రేమ కథకు ఉద్వేగ పూరితమైన ముగింపు లభిస్తే అలాంటి కథలు వెండితెరపై చీరస్థాయిగా నిలిచిపోతాయి. మొదట్లో చెప్పినట్టే ఇలాంటి కథల్లో సీతారామానికి ప్రత్యేక స్థానం ఉంటుంది.
-ఎవరు ఎలా చేశారంటే
ఎటువంటి సందేహం లేదు. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాకి ప్రాణం పోశాడు. రామ్ పాత్రలో జీవించాడు అంటే చిన్న మాటే అవుతుంది. అతడి అందం, మాట తీరు, నడుచుకునే పద్ధతి, హావ భావాలు పలికించిన తీరు, ఇలా అన్ని కోణాల్లో ఆయన పాత్ర సాగుతుంది. ఏ మాటకు ఆ మాటే అతడి కళ్ళల్లో ఉన్న రొమాంటిక్స్ ఫీలింగ్ ఈ సినిమాలో మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక మృణాల్ పాత్ర మెల్లమెల్లగా ప్రేక్షకులకు ఎక్కుతుంది. కానీ ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడంలో ఎంచుకున్న స్టైల్ వల్ల కాస్త డిఫరెంట్ గా ప్రేక్షకులు కనిపిస్తుంది. ఇక రష్మిక మందన్నా పాత్ర పొగరున్న అమ్మాయిగా కనిపిస్తుంది. ఇక సుమంత్ ది కూడా సర్ప్రైజింగ్ క్యారెక్టర్. దర్శకుడు సినిమాని బాగా ప్రేమించడం వల్ల ప్రతి పాత్రకు కూడా పేరు ఉన్న వాళ్లను తీసుకోవడం వల్ల ప్రేక్షకులకు ఈజీగా గుర్తుండిపోతాయి. ఇక ఈ సినిమా కథ 1965 – 85 మధ్యకాలంలో సాగేది కాబట్టి ఆ కాలంలోకి ప్రేక్షకుల్ని దర్శకుడు చాలా సులభంగా తీసుకెళ్లిపోయాడు. అసలు ఏవి సెట్లో, ఏవి రియల్ లోకేషన్ లో చెప్పడం చాలా కష్టం. ఇక పాటలు విషయానికొస్తే ప్రతిదీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో ఒక ఆల్బమ్ హిట్ రాలేదు. “ఇంత అందం” అనే పాట వెండితెరపై చాలా చాలా బాగుంటుంది. అన్ని విషయాల్లో ఎంతో తెలివిగా వ్యవహరించిన దర్శకుడు 20 ఏళ్ల లెటర్ని తెల్లని మల్లెపూవు లాగా చూపించడం ఏమాత్రం అతగలేదు. ఇక హను ఏ సినిమా తీసినా కథలో భిన్న పార్శ్వాలు ఉండేలా చూసుకుంటాడు. అతడి కథకు, వైజయంతి మూవీస్ తోడు కావడంతో ఈ సినిమాకు మరింత బలం తీసుకొచ్చింది. తొలి సగంలో అక్కడక్కడ ఫ్లాట్ నేరేషన్లో బోర్ కొట్టినా, చివరి సగం లో భావోద్వేగాలను పిక్స్ లోకి తీసుకెళ్లి పాత్రలు అన్నింటిని సమర్థంగా వాడుకొని ఒక ఎమోషనల్ క్లైమాక్స్ తో కథను దర్శకుడు ముగించాడు. ప్రేమంటే గౌరవమని, “గారూ, మీరూ” అని పిలిస్తేనే అది ఇంకా పెరుగుతుంది. ఒక ముద్దు సన్నివేశం కూడా లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగులు అసలు లేకుండా, ప్రేక్షకుడు ఎక్కడా తలదించుకోకుండా ఒక క్లీన్ లవ్ స్టోరీ తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే హను రాఘవపుడికి, అతడు తీసిన సీత రామం కి చాలా గట్సే ఉన్నాయి.
బాటమ్ లైన్: ‘సీతారామం’ యుద్ధాన్ని గెలిచిన ప్రేమ కథ
రేటింగ్ 3.5
Also Read:Janhvi Kapoor Sold House: జాన్వీ కపూర్ ఇంటిని స్వాధీనం చేసుకున్న ప్రముఖ స్టార్ హీరో
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Dulquer salmaan sita ramam movie review in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com