Hyderabad: భారత దేశం ఒకప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లకు నిలయం. ఇప్పటికీ చాలా మంది వాటిని నమ్ముతారు. అయితే యువతర మాత్రం కట్టుబాట్లను స్వేచ్ఛకు భంగంగా భావిస్తోంది. పనికిమానవిగా కొట్టిపారేస్తోంది. వాటితో లాభం లేదని వాదిస్తోంది. కట్టుబాట్లను పక్కన పెట్టి స్వేచ్ఛ పేరుతో పాశ్చాత్య పోకడలకు అలవాటు పడుతోంది. విదేశీయులు మన సంప్రదాయాన్ని ఇష్టపడుతుంటే… మన యువత మాత్రం పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులవుతోంది. ఇదే అనేక అనార్థలకు దారి తీస్తోంది. నేడు స్త్రీ, పురుషులు సమానం అన్న పేరుతో అన్నిరంగాల్లో అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి పనిచేస్తున్నారు. పరిచయాలు పెంచుకుంటున్నారు. ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం ఎంజాయ్ పేరుతో ప్రేమ, పెళ్లి పక్కన పెట్టి.. తమ కోరికలను తీర్చుకోవడానికి కలిసి ఉంటున్నారు. దీనికి సహజీవనం అని పేరు పెట్టారు. ఇద్దరూ ఇష్టపడి కలిసి ఉంటే తప్పు లేదని న్యాయస్థానాలు కూడా చెబుతున్నాయి. దీంతో ఈ సహజీవన సంస్కృతి క్రమంగా పెరుగుతోంది. తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగాలు చేసే యువతీ యువకులు ఈ సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు. అయితే.. తర్వాత నష్టపోయామని బాధపడుతున్నారు. పెద్దల మాట వినలేదే అని పశ్చాత్తాపం చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితే ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఎదురైంది. సహజీవనం పేరుతో ఓ మహిళ తనని మోసం చేసిందని.. చివరకు పోలీసులను ఆశ్రయించాడు.
ఏం జరిగిందంటే..
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కిరణ్‌కుమార్ ఏడాదిగా హైదరాబాద్ కృష్ణానగర్ ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. అద్దె మిగులుతుందనే భావనతో.. తనతో రూమ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సంప్రదించలంటూ ఓఎల్‌ఎక్స్‌లో ఓ ప్రకటన ఇచ్చాడు. కిరణ్‌కుమార్ ఇచ్చిన ప్రకటనకు ఓ మహిళ ఆసక్తి చూపించింది. ఇద్దరూ కొన్నాళ్లు అదే గదిలో ఉన్నారు. తరువాత కొంతకాలానికి కూకట్‌పల్లికి మకాం మార్చారు. అయితే కొద్ది రోజులకు ఆ మహిళ తాను ఒక వేశ్యనని చెప్పడంతో కిరణ్ కుమార్ కంగుతిన్నాడు.
ఖాళీ చేయమని కోరినా..
అసలు విషయం తెలిశాక కిరణ్ కుమార్ సదరు మహిళను తన రూంలో నుంచి వెళ్లిపోవాలని సూచించాడు. కానీ అందుకు ఆ మహిళ ఒప్పుకోలేదు. గతంలో ఇద్దరు దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించింది. అక్కడితో ఆగకుండా కిరణ్ కుమార్ తనపై లైంగికంగా దాడి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు సదరు మహిళకు 4.7 లక్షల పరిహారం ఇప్పించారు.
అయినా నెట్టింట్లో ఫొటోలు..
పరిహారం తీసుకన్న తర్వాత కూడా సదరు మహిళ మిన్నకుండలేదు. గతంలో ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు క్లోజ్‌గా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. వాటిని చూసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ షాక్ అయ్యాడు. దీంతో వెంటనే బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే వారు ఆ ఫొటోలను తొలగించారు. తర్వాత సదరు మహిళ ఇద్దరి వ్యక్తులతో కిరణ్ కుమార్‌పై దాడి చేయించింది. దీంతో బాధితుడు కిరణ్ కుమార్ మరోసారి ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా మొత్తంగా తాను ఇచ్చిన ఓ చిన్న ప్రకటన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు పెద్ద సమస్య తెచ్చిపెట్టంది. ఏకు మేకై కూర్చుంది.