UP Women: రాను రాను మనుషుల మధ్య అహం పెరిగిపోతుంది. అది అంతిమంగా కుటుంబాల మధ్య ఆగాథాలకు కారణమవుతోంది. లేనిపోని గొడవలను సృష్టించి, ఇబ్బందులను కలగజేస్తున్నది. కొన్నిసార్లు దారుణమైన సంఘటనలు చోటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నది. ఉత్తరప్రదేశ్ బారాబంకీ ప్రాంతంలో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ ప్రాంతానికి చెందిన చంద్ర ప్రకాష్ మిశ్రా (35) అనే వ్యక్తి కి ఓ చెల్లి పూజ ఉంది. ఆమెకు ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. 26న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో తన చెల్లి పెళ్లికి కానుకగా టీవీ, బంగారు ఉంగరం ఇస్తానని చంద్రప్రకాష్ హామీ ఇచ్చాడు. ఇది చంద్రప్రకాశ్ భార్యకు అస్సలు నచ్చలేదు. భర్త నిర్ణయంతో ఆమె ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆడపడుచు పెళ్లికి అంత విలువైన కానుకలు ఇవ్వడం దేనికని ఆమె గొడవ పడింది. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
ఆ మరుసటి రోజు ఇదే విషయాన్ని భార్య తన సోదరులకు చెప్పింది. వారిని ఇంటికి పిలిపించింది. ఇంటికి వచ్చిన సోదరులతో ఈ విషయాన్ని గురించి తీవ్రంగా చర్చించింది. తన సోదరి చెప్పిన మాటలతో వారు ఆగ్రహానికి గురై చంద్రశేఖర్ ను కర్రలతో తీవ్రంగా కొట్టారు. గంటపాటు అతడిని తీవ్రంగా కొట్టడంతో రక్తం వచ్చింది. గాయపడిన అతడిని చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బామ్మర్దులు కొట్టిన దెబ్బలకు అతని అవయవాలకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. ఫలితంగా అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్ర ప్రకాష్ భార్యను, ఆమె సోదరులు, హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.