https://oktelugu.com/

UP Bank Employee: బ్యాంకు మేనేజర్ కు డ్యూటీలో ఉండగానే దారుణం..వెలుగులోకి షాకింగ్ వీడియో

రాజేష్ వయసు 38 సంవత్సరాలు. గతంలో కోవిడ్ బారిన పడ్డాడు. ఆ తర్వాత చికిత్స తీసుకున్నాడు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు. యధావిధిగా తన బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం వాకింగ్ కూడా వెళ్తున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 27, 2024 2:41 pm
    UP Bank Employee

    UP Bank Employee

    Follow us on

    UP Bank Employee: అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. మహోబా జిల్లా.. ఆ జిల్లా కేంద్రంలో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు ఉంది. అక్కడ రాజేష్ షిండే అనే వ్యక్తి మేనేజర్ గా పనిచేస్తున్నాడు.. ఖాతాదారులతో బ్యాంకు ఆవరణ మొత్తం సందడిగా ఉంది.. బ్యాంకు లావాదేవీలు, ఇతర వ్యవహారాల గురించి తోటి సిబ్బందితో రాజేష్ చర్చలు సాగిస్తున్నాడు.. లాప్ టాప్ లో బ్యాంకు కు సంబంధించి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు.. ఇతర ఉద్యోగులు కూడా తమ పనుల్లో నిమగ్నమైపోయారు. అప్పటిదాకా పని చేసిన రాజేష్ ఒక్కసారిగా నీరసపడిపోయాడు.. తన కూర్చున్న కుర్చీలో వెనక్కి నడుం వాల్చాడు. చాతి దగ్గర చేయి పెట్టుకుని అలానే అవస్థ పడుతున్నాడు. ఈలోగా తోటి సిబ్బంది చూసి.. అతడికి గుండెపోటు వస్తుందని భావించి సీపీఆర్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

    రాజేష్ వయసు 38 సంవత్సరాలు. గతంలో కోవిడ్ బారిన పడ్డాడు. ఆ తర్వాత చికిత్స తీసుకున్నాడు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు. యధావిధిగా తన బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం వాకింగ్ కూడా వెళ్తున్నాడు. మాంసాహారం పూర్తిగా మానేశాడు. అయినప్పటికీ అతనికి గుండెపోటు రావడం పట్ల తోటి ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అతడికి ఎటువంటి గుండె సంబంధిత వ్యాధులు లేవని కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే అతడిని పరీక్షించిన వైద్యులు.. గుండెపోటు తీవ్రంగా రావడంతోనే చనిపోయాడని నిర్ధారించారు.

    ఇక ఇటీవల కాలంలో తీవ్రస్థాయిలో గుండెపోటు సంభవిస్తున్న సంఘటనలు పెరిగిపోయాయి.. చాలామంది చిన్న వయసులోనే తీవ్రమైన గుండెపోటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదులుతున్నారు. అత్యవసర సమయంలో సీపీఆర్ చేస్తే బతికే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నప్పటికీ.. ఉపయోగం ఉండడం లేదు. నూటికి ఐదు లేదా పది కేసుల్లో మాత్రమే ఫలితం ఉంటున్నది.

    మరోవైపు ఇలాంటి గుండెపోట్లు రాకుండా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు మాంసాహారానికి దూరంగా ఉండాలని, మద్యాన్ని ముట్టొద్దని, ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఒత్తిడికి దూరంగా ఉండే ఉద్యోగాలు చేయాలని.. శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు. కొన్నిసార్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ గుండెపోటు వస్తుందని.. అలాంటప్పుడు సిపిఆర్ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చని వివరిస్తున్నారు.