Crime News : ఎన్నో సినిమాల్లో పై ఉపోద్ఘాతానికి సంబంధించిన దృశ్యాలను మనం చూసే ఉంటాం. అయితే రియల్ లైఫ్ లో ఇటువంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ఈ సంఘటన కూడా దాదాపు అలాంటిదే. అయితే ఈ ఘటనలో ఓ గజదొంగ పోలీసులకు చిక్కాడు.. కటకటాలపాలయ్యాడు. ఇన్నాళ్లపాటు పోలీసులకు దొరకకుండా.. తప్పించుకొని తిరిగిన అతడు.. ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.. అయితే ఈ వ్యవహారంలో అతడిని పోలీసులకు దొరికేలా చేసింది చిన్న ఆధారమే. ఆ ఆధారం ప్రకారం పోలీసులు దర్యాప్తు చేయగా.. కీలక విషయాలు వెలుగు చూసాయి. అంతేకాకుండా ఓ భారీ దోపిడీ కేసు కూడా వెలుగులోకి వచ్చింది.
2019లో చోరీ
2019 సంవత్సరం డిసెంబర్ నెలలో హైదరాబాదులో జూబ్లీహిల్స్ ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించి కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు. భారీగా నగదు, ఆభరణాలు చోరీ చేశాడు. ఆ తర్వాత వాటితో రాత్రికి రాత్రే నేపాల్ పారిపోయాడు. ఈ చోరికి పాల్పడిన వ్యక్తి పేరు గోవింద్ బండారి.. ఆ ఘటన జరిగిన తర్వాత పోలీసులు వేలిముద్రలు సేకరించారు.. సిసి ఫుటేజీలు.. ఇతర ఆధారాలను పరిశీలించినప్పటికీ గోవింద్ బండారి ఆచూకీ లభించలేదు. చివరికి పోలీసులు ఈ కేసును నాన్ ట్రేస్ డ్ జాబితాలో చేర్చారు. అయితే ఐదు సంవత్సరాల గ్యాప్ తర్వాత పోలీసులకు లభించిన ఒక చిన్న ఆధారం గోవింద్ బండారిని పట్టించేలా చేసింది.. జూబ్లీహిల్స్ లో భారీ చోరీ చేసిన తర్వాత గోవింద్ బండారి నేపాల్ పారిపోయిన విషయం తెలిసిందే. సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ అతడు హైదరాబాద్ వచ్చాడు.. మళ్లీ తన దొంగతనాలను ప్రారంభించాడు. ఈసారి సెల్ ఫోన్ లను చోరీ చేయడం మొదలుపెట్టాడు. అయితే హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసులకు గోవింద్ బండారి దొరికిపోయాడు. అతని వద్ద సేకరించిన వేలి ముద్రలను పోలీసులు.. 2019 జూబ్లీహిల్స్ చోరీ కేసులో నమోదు చేసుకున్న వేలిముద్రలతో పరిశీలించారు. అవి ఇవి సరిపోవడంతో.. నాడు దొంగతనానికి పాల్పడింది గోవింద్ బండారి అని వచ్చారు. ఇదే విషయంలో అతడిని విచారించగా.. జూబ్లీహిల్స్ ప్రాంతంలో చోరికి పాల్పడింది తనే అని గోవింద్ ఒప్పుకున్నాడు.. దీంతో అతడిని పోలీసులు జైలుకు తరలించారు. అయితే నాడు చోరీ చేసిన సొమ్మును అతడు ఏం చేశాడు? ఎవరికి ఇచ్చాడు? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 2019 లో జరిగిన దొంగతనం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసులో ఒక్క ఆధారం కూడా పోలీసులకు లభించకపోవడం సవాల్ గా మారింది. ఆ తర్వాత ఫోరెన్సిక్ విభాగం వేలిముద్రలను సేకరించడంలో విజయవంతమైంది. నాడు సేకరించిన వేలిముద్రలే ఇప్పుడు గోవింద్ బండారిని కట కటాల పాలయ్యేలా చేశాయి.