Unethical Journalists: ఈ సమాజానికి నష్టం వాటిల్లేది ఉగ్రవాదుల వల్లో, తీవ్రవాదుల వల్లో కాదు.. సో కాల్డ్ జర్నలిస్టుల వల్లే. ఎందుకంటే ఉగ్రవాదులకు ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. తీవ్రవాదులకు ఒక ప్రాతిపదిక అంటూ ఉంటుంది. కానీ పిడిఎఫ్ జర్నలిస్టులకు ఎటువంటి లక్ష్యం ఉండదు. వసూళ్ళే వారికి అసలైన ప్రాతిపదిక. ప్రభుత్వాధికారులను బెదిరించడం.. ఇబ్బంది పెట్టేలాగా రాయడం.. వాటిని రకరకాల సోషల్ మీడియా గ్రూపులలో షేర్ చేయడం.. భయభ్రాంతులకు గురి చేయడం.. ఇదే వారికి తెలిసిన జర్నలిజం. దీన్ని జర్నలిజం అంటారా? ఇటువంటి వ్యక్తులను జర్నలిస్టులు అంటారా? ఇటువంటి జర్నలిస్టుల వల్ల ఇబ్బంది పడిన ఓ మండల రెవెన్యూ అధికారి తన బుర్రకు పని చెప్పాడు. ఆ కీచక పాత్రికేయులను జైలుకి పంపించాడు.
వరంగల్ జిల్లాలో జననిర్ణయం అనే పేరుతో ఓ సో కాల్డ్ పిడిఎఫ్ పేపర్ రన్ అవుతున్నది. దీనిని దామెర రాజేందర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఇటీవల రాజేందర్ అయినవోలు తహసీల్దార్ విక్రమ్ కుమార్ పై అడ్డగోలుగా వార్తలు రాయడం మొదలు పెట్టాడు. దీనిపై విక్రమ్ కుమార్ స్పందించాడు. మొదట్లో వీటిపై స్పందించకూడదు అనుకున్నప్పటికీ.. సోషల్ మీడియాలో తన క్యారెక్టర్ కు డ్యామేజ్ జరుగుతున్న నేపథ్యంలో విక్రమ్ కుమార్ రెస్పాండ్ అయ్యాడు. రాజేందర్ ను పిలిపించి మాట్లాడాడు. నేను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని.. అడ్డగోలుగా కథనాలు రాయడం సరికాదు అన్నాడు. దానికి డబ్బులు ఇస్తేనే ఈ కథనాలను ఆపివేస్తామని రాజేందర్ స్పష్టం చేశాడు. అంతేకాదు రాజేందర్ తన సోదరుడు రవీందర్ అనే వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చాడు. విక్రమ్ కుమార్ తో బేరసారాలకు దిగాడు. తదుపరిగా కథనాలు రాకుండా ఉండాలి అంటే రెండు లక్షలు డిమాండ్ చేశాడు. అయితే ఇక్కడే ఎమ్మార్వో విక్రమ్ కుమార్ తన బుర్రకు పదును పెట్టాడు. తాను ఎటువంటి అక్రమాలు చేయకపోయినప్పటికీ డబ్బులు డిమాండ్ చేసిన రాజేందర్, రవీందర్ కు బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న పోలీసులకు చెప్పాడు. వారు ఇచ్చిన సలహాతో రివర్స్ స్టింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాడు.. పోలీసుల సహకారంతో రాజేందర్, రవీందర్ సంభాషణలు మొత్తం రికార్డు చేశాడు. అంతేకాదు ఆన్లైన్ ద్వారా రవీందర్, రాజేందర్ కు 10000 రూపాయలు పంపించాడు. అంతేకాకుండా మిగతా నగదు మొత్తాన్ని తీసుకోవడానికి తన కార్యాలయానికి రావాలని వారికి చెప్పాడు. దీంతో రవీందర్ సంబరపడుకుంటూ ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లాడు. ఇదే క్రమంలో ఎమ్మార్వో ఆయనకు 30 వేల నగదు ఇచ్చాడు. దానికి అతడు ఒప్పుకోలేదు. మిగతా 1,90,000 నగదు ఇవ్వాల్సిందని పట్టుబట్టాడు. మరొక విడతలో ఇస్తానని చెప్పిన ఆయన.. 30,000 ఇప్పుడు ఇస్తున్నానని చెప్పడంతో రాజేందర్ సంబరపడుకుంటూ తీసుకున్నాడు. ఆ నగదును జేబులో పెట్టుకుంటుండగా.. అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Also Read: Domestic Violence:పరాయి వ్యక్తితో భార్య “ఏకాంత చర్చ”.. అడిగినందుకు భర్తకు ఈ శిక్ష
ఆ తర్వాత రాజేందర్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఎమ్మార్వో ఇచ్చిన రికార్డెడ్ వాయిసులను పోలీసులు ప్రాథమిక ఆధారాలుగా భావించి.. అరెస్ట్ చేశారు. అంతేకాదు విలేకరుల పేరుతో డబ్బులు వసూలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం నెలకొంది. అంతేకాదు ఇటీవల కాలంలో పిడిఎఫ్ పేపర్లు పెరిగిపోయిన నేపథ్యంలో.. ఈ తరహా బెదిరించి ఇబ్బంది పట్టే వారిపై నిఘా పెడతామని పోలీసులు చెబుతున్నారు.