Siddipet Crime :ఈ భూమ్మీద ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే చనిపోయే వరకు ప్రతి అవసరం కూడా డబ్బుతోనే తీరుతుంది. ప్రతి సౌకర్యం కూడా డబ్బు ద్వారానే వస్తుంది. ప్రతి విలాసం కూడా డబ్బుతోనే సమకూరుతుంది. అంటే డబ్బు లేనిది మనిషి జీవితం లేదు. ఆ డబ్బు కోసం మనిషి కష్టపడాలి. చెమట చిందించాలి. ఇబ్బందులు ఎదుర్కోవాలి. పస్తులుండాలి. చివరికి కళ్ళట్ కాయలు కాచే విధంగా ఎదురు చూడాలి. అలా వచ్చిన డబ్బు నిలబడుతుంది. సౌకర్యాన్ని అందిస్తోంది. సౌలభ్యాన్ని కల్పిస్తుంది. సుఖాన్ని చెంతకు చేర్చుతుంది. కానీ ఇలా కష్టపడకుండా.. చెమట చిందించకుండా డబ్బు సంపాదించాలని చాలామంది అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆ డబ్బులు సంపాదించడానికి అడ్డదారులు తొక్కడానికైనా వెనుకాడటం లేదు. అలాంటి ఓ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన మనుషుల మధ్య మాయమవుతున్న బంధాలను.. డబ్బు కోసం వారు చేస్తున్న ఆకృత్యాలను కళ్లకు కట్టింది.
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా పెద్ద మాసాన్ పల్లి ప్రాంతంలో రామవ్వ అనే మహిళ జీవిస్తోంది. ఈమెకు 60 సంవత్సరాలు. పిల్లలకు పెళ్లిళ్లయిపోయాయి. ఎవరికి వారుగా సంవత్సరాలు చేసుకుంటున్నారు. రామవ్వ కూడా ఇంటి వద్ద ఉంటున్నది. రామవ్వ కు ఓ కూతురు ఉంది. ఆమెను తోగుట మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ కు ఇచ్చారు. రామవ్వకు 60 సంవత్సరాల వయసు రావడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆమె పేరు మీద ఇన్సూరెన్స్ చేయించారు. పైగా ఆమె పేరు మీద వ్యవసాయ భూమి ఉండడంతో రైతు బీమా కూడా నమోదయింది. పోస్ట్ ఆఫీస్ లో కూడా ఆమె పేరు మీద ఇన్సూరెన్స్ చేయించారు. ఇవన్నీ కూడా వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగాయి. అయితే వెంకటేష్ మొదటి నుంచి కూడా జులాయిగా తిరుగుతుండేవాడు. పెళ్లి జరిగినప్పటికీ ఒళ్ళు వంచి కష్టం చేసేవాడు కాదు. పైగా అతడికి వ్యసనాలు కూడా.. విపరీతంగా తాగేవాడు. భార్యను కొట్టేవాడు.అత్త పేరుమీద ఇన్సూరెన్స్ లు చేయించిన నేపథ్యంలో ఎలాగైనా రామవ్వను చంపాలని అతడు అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఒక క్రూరమైన ఆలోచనకు తెర తీశాడు. దానిని ఓ వ్యక్తితో చెప్పాడు. దానికి అతడు ఓకే అన్నాడు. రామవ్వను చేతికి మట్టి అంటకుండా చంపితే దండిగా డబ్బు ఇస్తానని ఆ వ్యక్తికి చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి కూడా ఒప్పుకున్నాడు. ఇందులో భాగంగా ముందుగా ఆ వ్యక్తికి వెంకటేష్ రెండు లక్షలు సుఫారీ ఇచ్చాడు. ఆ తర్వాత సుఫారి తీసుకున్న వ్యక్తి రామవ్వను అంతం చేశాడు.
సిద్దిపేట జిల్లా పెద్ద మాసాన్ పల్లిలో రామవ్వ నడుచుకుంటూ వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. ఆ తర్వాత ఆమెను అంతం చేశారు. అత్యంత చాకచక్యంగా ఆమె మృతదేహాన్ని రోడ్డుమీద తీసుకువచ్చారు. గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులను వెంకటేష్ నమ్మించాడు. ఆ తర్వాత తనదైన శైలిలో నటించడం మొదలుపెట్టాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వెంకటేష్ పడుతున్న తాపత్రయం స్థానికులకు అనుమానం కలిగించింది. వెంటనే వారు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. పోలీసులు వారిదైన శైలిలో విచారణ సాగించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు విషయాలను రాబట్టారు. ఆ తర్వాత అతను సుపారీ ఇచ్చిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు.. కాగా ఈ సంఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది.