Hyderabad: “నువ్వంటే నాకిష్టం లేదు. ఎందుకో అతడే నాకు పదేపదే గుర్తుకొస్తున్నాడు. నాపై విపరీతమైన ప్రేమ కనబరుస్తాడు. నేనంటే ఆరాధనగా చూస్తాడు. అందువల్లే అతడిని మర్చిపోలేకపోతున్నాను.. అతడితోనే జీవించాలని నిర్ణయించుకున్నాను.. అన్ని ఆలోచించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. నా జీవితం నా ఇష్టం. జీవితంలో నీకు కనిపించను. ఇలా చెబుతున్నందుకు ఇబ్బందిగానే ఉన్నప్పటికీ తప్పడం లేదు. నా కొడుకుని కూడా తీసుకుని వెళుతున్నాను. వేరే విధంగా అనుకోవద్దు. నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు” ఇదీ ఓ భర్తకు భార్య రాసిన లేఖ. అతడు ఈ లేఖను చదివే సమయం నాటికే ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
ప్రియుళ్ళ మోజులో పడి భార్యలు భర్తలను చంపేస్తున్న రోజులువి. అత్యంత దారుణంగా.. సినిమాలకు మించి ప్రణాళికలతో అంతం చేస్తున్న పాడు దినాలు ఇవి. అందువల్లే చాలామంది మగవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. పెళ్లి కుదిరినప్పటికీ ముందుకు రావడం లేదు. పైగా పెళ్లి చేసుకున్నా.. హనీమూన్ వెళ్లడానికి ఆసక్తిని చూపించడం లేదు. ఇటువంటి రోజుల్లో ఓ భార్య చేసిన పని సంచలనమైంది. ఇటువంటి నిర్ణయం ఆమె ఎందుకు తీసుకుంది అనే విషయం పక్కనపెడితే.. ఈ వ్యవహారంలో ఆమె తన భర్తప్రాణాలను కాపాడింది.
హైదరాబాద్ నగరంలోని నాగోల్ లో తట్టి అన్నారం అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో జై హిందర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడికి సావిత్రి అనే భార్య ఉంది. జై హిందర్ స్థానికంగా ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా.. సావిత్రి క్యాటరింగ్ సంస్థలో పనిచేస్తోంది. సావిత్రికి బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల పరిచయం అయ్యాడు. అది కాస్త వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. తరచూ అతడు బెంగళూరు నుంచి హైదరాబాద్ రావడం.. సావిత్రి అతడిని కలవడం పరిపాటిగా మారిపోయింది. వారిద్దరి మధ్య శారీరక బంధం కూడా ఏర్పడింది. దీంతో అతడిని విడిచి ఉండలేని పరిస్థితికి సావిత్రి చేరుకుంది. దీంతో అతనితోనే జీవితం కొనసాగించాలని నిర్ణయానికి వచ్చింది. ఇటీవల కాలంలో ఈ తరహా బంధాలు నడుపుతున్న భార్యలు తమ భర్తలను చంపేశారు.. ప్రియుళ్ళ సహకారంతో అంతం చేశారు. అయితే సావిత్రి మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదు. తన ఐదు సంవత్సరాల కుమారుడు విక్రాంత్ ను తీసుకుని బెంగళూరులో ఉన్న తన ప్రియుడి దగ్గరికి వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ ఒక లేఖను కూడా రాసింది. జై హిందర్ ఇంటికి వచ్చి చూస్తే సావిత్రి కనిపించకపోవడం.. ఆమె రాసిన లేఖ కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనను వదిలిపెట్టి వెళ్లిపోయిన భార్య గురించి ఇబ్బంది లేదని.. కుమారుడి గురించే తన తాపత్రయం అని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.