Scam Alert: జేబుకు తెలియకుండా పర్స్ లాగేయడం.. అందులో ఉన్న నగదు మొత్తం జేబులో వేసుకుని.. ఖాళీ పర్స్ పక్కన పడేయడం వెనకటి కాలంలో ఇలానే దొంగతనాలు జరిగేవి. ఇప్పుడు కాలం మారింది. వైట్ కాలర్ దొంగతనాలు పెరిగిపోయాయి. అన్నింటికీ మించి ముక్కు ముఖం తెలియకుండా చేసే దొంగతనాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.
నేటి స్మార్ట్ కాలంలో అడ్డగోలుగా దండుకునేవారు పెరిగిపోయారు. అలాంటిదే ఈ స్కాం కూడా. గతంలో లింకులు పంపి.. లేదా అరెస్టులు, ఇతర వ్యవహారాల పేర్లు చెప్పి మోసం చేసేవారు. డబ్బులు దండుకునేవారు. కానీ ఇప్పుడు తెరపైకి మరో కొత్త వ్యవహారంతో స్కామర్లు దోచుకునే మార్గానికి రూపకల్పన చేశారు. చూస్తుండగానే ఖాతా ఖాళీ చేసి నిండా ముంచుతున్నారు. ఇంతకీ ఈ స్కామ్ ఎలా చేస్తారు? దీని పేరు ఏమిటి? ఎలా అప్రమత్తంగా ఉండాలి అంటే..
ముందు మనకు అపరిచిత నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ ఎత్తగానే తీయగా మాట్లాడుతారు. ” హలో బాగున్నావా.. ఎక్కడున్నావ్.. నీ నెంబర్ నాకు ఫలానా మీ స్నేహితుడు ఇచ్చాడు” అని మాట్లాడుతారు. మనం తేరుకునే లోగానే మరో నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది.” మీరు ఒక్క నిమిషం ఉండండి. నాకు వేరే ఫోన్ నుంచి కాల్ వస్తోంది” అని చెబితే..” అది మన స్నేహితుడిదే.. కాల్ కలపండి ముగ్గురం సరదాగా మాట్లాడుకుందాం” అని ఇవతల వ్యక్తి అంటాడు. క్యూరియాసిటీ కొద్దీ కాల్ కలిపితే.. అవతలి వ్యక్తి కొద్ది క్షణాలు మాత్రమే మాట్లాడుతాడు. ఆ తర్వాత కాల్ కట్ అవుతుంది..
ఆ నెంబర్ కి మళ్ళీ మనం ట్రై చేస్తే కలవదు.. అయితే ఆ వ్యక్తి మాట్లాడుతున్నంత సేపు మన ఫోన్ కు ఒక ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి తెలుసుకున్న స్కామర్.. అప్పటికే ఆ ఓటిపిని ఎంటర్ చేసి మన ఖాతాను మొత్తం ఖాళీ చేస్తాడు.. ఇటీవల కాలంలో జరుగుతున్న స్కామ్ ఇది.. అయితే ఇటువంటి స్కామర్ల బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి.. ముఖ్యంగా అపరిచిత కాల్స్ ఎత్తకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కాన్ఫరెన్స్ కాల్ కలపకూడదు. మరీ ముఖ్యంగా ఓటిపి వస్తే లౌడ్ స్పీకర్ లో చెప్పే ఆప్షన్ డిజేబుల్ చేయాలి. సాధ్యమైనంతవరకు వ్యక్తిగత విషయాలను అపరిచిత వ్యక్తులతో చెప్పడం పూర్తిగా మానేయాలి. ఎందుకంటే అపరిచిత వ్యక్తులు వివిధ మార్గాల ద్వారా మన నెంబర్లు సేకరించి ఇదిగో ఇలాంటి స్కామ్ లకు పాల్పడుతుంటారు.
అయితే ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు ఒక వ్యవస్థ లాగా ఉంటారు. ముఖ్యంగా వీరంతా ఉత్తరాది రాష్ట్రాల్లోని ఢిల్లీ, రాజస్థాన్ ప్రాంతాలలో ప్రత్యేకంగా కాల్ సెంటర్లు పెట్టుకొని ఇలాంటి నేరాలకు పాల్పడుతుంటారు. అందువల్లే ఇలాంటి ముఠా చేతిలో చిక్కకుండా సాధ్యమైనంతవరకు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు అపరిచిత వ్యక్తులు చేసే నెంబర్లను ఎత్తకపోవడం మంచిదని సూచిస్తున్నారు.