https://oktelugu.com/

Crime News : పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ.. తర్వాత ఏం జరిగిందంటే..

రక్తపు మడుగులో ఆమె కొట్టుకుంటూ మరణించింది. ఈ విషయం గిరిజ కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు లబోదిబోమంటూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు. తమ కూతురు హత్యకు గురి కావడంతో గిరిజ కుటుంబ సభ్యులు కంటికి ధారగా విలపిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 15, 2024 / 05:01 PM IST

    Crime News

    Follow us on

    Crime News : సంసారం అన్నాక గొడవలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాటిని పెద్దవి చేసుకోకుండా వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే చినికి చినికి గాలి వాన లాగా మరి మరింత పెద్ద సమస్యలను సృష్టిస్తాయి. చాలా వరకు కుటుంబాలలో ఇటీవల కాలంలో సమస్యలు ఎక్కువయ్యాయి. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం కూడా దీనికి ఒక కారణం. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం పెరిగిపోయింది. పని ఒత్తిడి, వివాహేతర సంబంధాలు వంటి కారణాలవల్ల భార్యాభర్తలు విడిపోతున్నారు. కొన్నిసార్లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే పిల్లల విషయంలో ఏర్పడిన చిన్న వివాదం ఒక కుటుంబంలో తీవ్ర ఘర్షణకు దారి తీసింది. విచక్షణ కోల్పోయిన భర్త కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా ఆ కుటుంబంలో తీరని శోకం నెలకొంది.

    కర్ణాటక రాజధాని బెంగళూరులోని హెచ్ ఏ ఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నసంద్రం అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో నవీన్, గిరిజ (30) అనే దంపతులు నివసిస్తున్నారు. . నవీన్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గిరిజ ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. వీరిద్దరి మధ్య అనుకోకుండా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే మొదట్లో వారి ప్రేమను గిరిజ కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. చివరికి వారందరినీ ఒప్పించి నవీన్ గిరిజను ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. మొదట్లో వారి సంసారం బాగానే జరిగింది.. ప్రేమ పెళ్లి కావడంతో నవీన్, గిరిజ చిలకా గోరింకల్లా ఉన్నారు.

    వివాహ అనంతరం నవీన్, గిరిజ బెంగళూరులో స్థిరపడ్డారు. పెళ్లయిన కొద్ది నెలలకే గిరిజ గర్భం దాల్చింది. అయితే అనుకోని పరిస్థితుల్లో ఆమెకు గర్భస్రావమైంది. వైద్యులకు చూపిస్తే ఇప్పట్లో ఆమె తల్లయ్యే అవకాశం లేదని.. అలా జరిగితే అది ఆమె ప్రాణాలకే ముప్పని హెచ్చరించారు. కానీ గిరిజ తనకు బిడ్డ కావాలని పట్టుబట్టింది. నవీన్ ఎంతగా నచ్చ చెప్పినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య ప్రతిరోజు దీనికి సంబంధించి గొడవ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నవీన్ ఒకరోజు తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. భార్య ప్రవర్తన తీరు తట్టుకోలేక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఏప్రిల్ 12న గాఢంగా నిద్రిస్తున్న భార్య గొంతు కోశాడు. రక్తపు మడుగులో ఆమె కొట్టుకుంటూ మరణించింది. ఈ విషయం గిరిజ కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు లబోదిబోమంటూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు. తమ కూతురు హత్యకు గురి కావడంతో గిరిజ కుటుంబ సభ్యులు కంటికి ధారగా విలపిస్తున్నారు.