Washington Road Accident: విధి చాలా బలీయమైనది. ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి కన్నీటిని మిగుల్చుతుందో.. ఎవరి జీవితాన్ని పూల పాన్పు చేస్తుందో చెప్పలేం. సౌఖ్యాలు అందినప్పుడు ఎవరూ పెద్దగా ఇబ్బంది పడరు. కానీ కన్నీరు ఎదురైనప్పుడు.. బాధ కలిగించే సందర్భం చోటు చేసుకున్నప్పుడు మాత్రం పరిస్థితి హృదయ విదారకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కుటుంబం కూడా అటువంటి దుస్థితిని ఎదుర్కొంటున్నది. ఈ కష్టకాలంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మానవతా హృదయం ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది.
అమెరికా దేశంలోని వాషింగ్టన్ రాష్ట్రంలో మాటలకందని విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దంపతులు మృతి చెందారు. వారి పిల్లలు తీవ్రంగా గాయపడి.. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతానికి చెందిన కృష్ణ కిషోర్, ఆశ దంపతులు కొంతకాలం క్రితం అమెరికాకు వెళ్లిపోయారు. కృష్ణ కిషోర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. సరిగ్గా 10 రోజుల క్రితం కృష్ణ కిషోర్ కుటుంబం ఇండియాకు వచ్చింది. స్వగ్రామం పాలకొల్లులో కుటుంబ సభ్యులతో గడిపేది. అమెరికాకు వెళ్లే క్రమంలో కృష్ణకుమార్ కుటుంబం దుబాయ్ లో ఆగింది. అక్కడ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంది. అనంతరం అమెరికా బయలుదేరి వెళ్లిపోయింది.
జీవితంలో స్థిరపడిన దశలో.. పిల్లలతో హాయిగా కాలం గడిచిపోతున్న క్రమంలో.. రోడ్డు ప్రమాదం కృష్ణ కిషోర్ ఆలోచనలను.. ఆశలను నాశనం చేసింది. ఘోరమైన రోడ్డు ప్రమాదం కృష్ణ కిషోర్, ఆయన భార్యను బలి తీసుకుంది. ఇద్దరు పిల్లలు శివాని (21), సుచై (16) తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరూ ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయాలు కావడంతో శివాని, సుచై అత్యవసర వైద్య విభాగం లో చికిత్స పొందుతున్నారు. వారికి ఖరీదైన వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూస్తుండగానే తల్లిదండ్రులను కోల్పోవడం.. వారు తీవ్రంగా గాయపడడంతో.. అమెరికాలో ఉన్న తెలుగు వారంతా శోకసముద్రంలో మునిగిపోయారు.
శివాని కాలేజీ, సుచై హై స్కూల్ చదువుతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి.. అనాధలుగా మిగిలిన సుచై, శివాని చదువులకు, ఇతర జీవన వ్యయాలకు సంబంధించిన నగదు అందించడానికి గోఫండ్ ద్వారా అమెరికాలో స్థిరపడిన ప్రవాస తెలుగు వారు సిద్ధమయ్యారు. ఈ లక్ష్యంతో దాదాపు 30 రోజుల్లో రెండు లక్షల 50 వేల డాలర్లు సేకరించడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ క్రమంలో అమెరికాలో స్థిరపడిన తెలుగువారు సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారు అందించే ప్రతి డాలర్.. శివాని, సుచై జీవితానికి మార్గదర్శకంగా ఉంటుందని భావిస్తున్నారు..
” కృష్ణ కిషోర్ కుటుంబం ఇక్కడే స్థిరపడింది. వారిద్దరి పిల్లలు కూడా హైస్కూల్, కాలేజీ చదువులు చదువుతున్నారు. తల్లిదండ్రులను కోల్పోవడంతో శివాని, ఆమె సోదరుడు సుచై దిక్కులేని వారయ్యారు. ఇలాంటి స్థితిలో ఆ ఇద్దరు పిల్లలకు అండగా ఉండాల్సిన బాధ్యత తెలుగు వారి మీద పడింది. ఈ క్రమంలో వారికి ఎంతో కొంత సహాయం అందిస్తే భరోసాగా ఉంటుంది. ఆ భరోసాను తెలుగు వారు మానవత దృక్పథంతో ఇస్తే.. కృష్ణ కిషోర్ దంపతుల ఆత్మకు శాంతి కలుగుతుందని ” ఆశా సోదరుడు పవన్, కృష్ణ కిషోర్ సోదరి శైలజ పేర్కొన్నారు.