Vallabhaneni Vamsi Mohan: తెలుగుదేశం( Telugu Desam) పార్టీ నుంచి ఎదిగిన వారు ఓ స్థాయికి వెళ్లారు. అందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కెసిఆర్ తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి స్వల్ప కాలంలోనే ఎదిగారు. ఓ సామాన్య జడ్పిటిసి గా ఉన్న రేవంత్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు చంద్రబాబు. అయితే ఉమ్మడి ఏపీలో నుంచి తెలుగుదేశం పార్టీని వీడే వరకు.. రేవంత్ రెడ్డికి పార్టీలో గొప్ప క్రేజ్ ఉండేది. ఎంతలా అంటే మహానాడుకు రేవంత్ హాజరయ్యే క్రమంలో టిడిపి శ్రేణుల నుంచి విపరీతమైన స్పందన లభించేది. అయితే అటువంటి క్రేజ్ తెలుగుదేశం పార్టీలో ఉండేది వల్లభనేని వంశీ మోహన్ కు. ఎందుకంటే ఆయన పార్టీ ఫిరాయించక పోయిన ముందు టిడిపి శ్రేణులు ఆయనను గౌరవభావంతోనే చూసేవి. ఒక యూత్ ఫుల్ లీడర్ గా పరిగణించేవి. మంచి ఫేస్ వాల్యూ ఉన్న నేతగా గుర్తించేవి. కానీ అదే వల్లభనేని వంశీ మోహన్ తప్పటడుగులు వేశారు. టిడిపి నుంచి వైసీపీలో చేరడం అనేది తప్పుడు నిర్ణయం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తరువాత చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చారిత్రాత్మక తప్పిదం. సహజంగా రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి కానీ.. ఆ స్థాయిలో విమర్శలు చేసి వల్లభనేని వంశీ మోహన్ తన క్రెడిబిలిటీని తగ్గించుకున్నారు.
* తనకు తాను తగ్గించుకొని..
రాజకీయాల్లో ఎలా ఉండకూడదు వల్లభనేని వంశీ మోహన్( Vamsi Mohan ) ఒక ఉదాహరణ. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సిఫారసుతో విజయవాడ ఎంపీ సీటును వంశీ మోహన్ కు కేటాయించారు చంద్రబాబు. అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఎదురైంది. ఆయనపై లగడపాటి రాజగోపాల్ గెలిచారు. కానీ ఆ ప్రయత్నం వల్లభనేని వంశీ మోహన్ రాజకీయ జీవితానికి పునాదిలా నిలిచింది. 2014లో గన్నవరం నియోజకవర్గ నుంచి గెలిచారు వల్లభనేని వంశీ మోహన్. ఐదేళ్లపాటు టిడిపి ఎమ్మెల్యేగా కొనసాగినాయన 2019లో రెండోసారి అసెంబ్లీకి పోటీ చేశారు. జగన్ ప్రభంజనంలో సైతం నిలబడగలిగారు. అయితే దానిని నిలుపుకోలేకపోయారు వల్లభనేని వంశీ మోహన్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించి వివాదాస్పద నేతగా మారిపోయారు. అప్పటివరకు ఆయన యూత్ లీడర్ గా ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక గుర్తింపు పొందారు. ఎప్పుడైతే అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారో.. అప్పటి నుంచి పతనం కావడం మొదలైంది.
* నియోజకవర్గానికి దూరంగా..
ప్రస్తుతం గన్నవరం( Gannavaram) నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు వల్లభనేని వంశీ మోహన్. అప్పుడప్పుడు హైదరాబాదు నుంచి నియోజకవర్గానికి వస్తున్నారు. అయితే వారంలో రెండు మూడు రోజులపాటు నియోజకవర్గంలో తిరగాలని హై కమాండ్ ఆదేశిస్తుంది. కానీ రాజకీయాలంటేనే పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఆయన. ఎక్కువగా హైదరాబాద్ కి పరిమితం అవుతున్నారు. కుటుంబ కారణాలతోపాటు అనారోగ్య సమస్యలు వెంటాడుతుండడంతో రాజకీయాలకు దూరం కావడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి 2024 ఎన్నికల నాటికి వల్లభనేని వంశీ మోహన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారు. అప్పట్లోనే ఆయన పోటీ చేయడానికి విముఖత చూపుతున్నట్లు ప్రచారం నడిచింది. అయితే వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీ మోహన్ తప్పకుండా పోటీ చేయాలని హైకమాండ్ ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. కానీ వంశీ మాత్రం తన కుటుంబ సభ్యులకు కాకుండా వేరే నేతలకు అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. అయితే మరోసారి జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ మోహన్ రాజకీయంగా ప్రయోగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో వల్లభనేని వంశీ మోహన్ యాక్టివ్ అయ్యేలా ఒత్తిడి పెంచుతున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.
* జగన్ ఆలోచన అదే..
వల్లభనేని వంశీ మోహన్ ద్వారా మునుపటి రాజకీయం చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ప్రణాళికగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాజకీయాల పట్ల విముఖతగా ఉన్నారు వంశీ. జైలు జీవితంతో పాటు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొనితెచ్చుకున్నారు. పోనీ మంత్రి పదవి లాంటి పెద్దవి అనుభవించారు అంటే అది లేదు. పైగా టిడిపిలో ఉన్నప్పుడు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేది. దానిని చెరిపేసుకుని జగన్ వెంట అడుగులు వేశారు. దానికి మూల్యం చెల్లించుకున్నారు. రాజకీయ జీవితానికి స్వస్తి పలుకుదాం అనుకుంటున్నా వీలుపడడం లేదు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం రాజకీయాల నుంచి వైదొలగడమే ఉత్తమమని సూచించినట్లు తెలుస్తోంది. మరి వల్లభనేని వంశీ మోహన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.