మనుషులు మారుతున్నారు. మానవ సంబంధాలను పక్కనపెట్టి మనీ బంధాలకే విలువనిస్తున్నారు. ఆస్తిపాస్తులు, డబ్బుకు మాత్రమే దాసోహమంటున్నారు. దీనికోసం ఎంతటి పన్నాగానికైనా.. మరెంతటి.. దారుణాలకైనా వెనుకంజ వేయడం లేదు. తల్లిదండ్రులు, బంధువులను ఏం చేయడానికైనా జంకడం లేదు. అవసరాలు ఉన్నాయని చెబితే.. తెలిసిన వ్యక్తికి ఓ మహిళ కొంత నగదు అప్పుగా ఇచ్చింది. కానీ అదే ఆమె ప్రాణాలకు ముప్పును తెచ్చింది. ఇచ్చిన అప్పు తీర్చమన్నందుకు ఆ మహిళను అతడు ఏకంగా హతమార్చాడు. సభ్య సమాజం భయభ్రాంతులకు గురైన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అలీ సాగర్ కాల్వలో ఇటీవల ఓ మహిళ మృతదేహం లభ్యమయింది. దీనికి సంబంధించి స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకురావడంతో వారు కేసు నమోదు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేయగా విస్తు గొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బొర్గం అనే గ్రామానికి చెందిన చంద్రకళ (46) మహిళ మృతదేహం ఇటీవల లభ్యమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఇందులో అసలు కోణం వెలుగులోకి వచ్చింది. బొర్గం గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తికి చంద్రకళ ఏడాది క్రితం 50,000 అప్పుగా ఇచ్చింది. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలని గంగాధర్ ను పలుమార్లు చంద్రకళ కోరింది. అయినప్పటికీ అతడు స్పందించలేదు.
డబ్బులు తిరిగి చెల్లించాలని ఇటీవల చంద్రకళ ఒత్తిడి తీసుకురావడంతో గంగాధర్ ఓ పథకం పన్నాడు. డబ్బులు ఇస్తానని చెప్పడంతో.. ఆమె బుధవారం అతడి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వచ్చిన ఆమెపై ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. పదునైన ఆయుధంతో ఆమె తలపై కొట్టాడు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే కన్ను మూసింది. పగలు కావడంతో చంద్రకళ మృతదేహాన్ని తరలించకుండా అర్ధరాత్రి వరకు గంగాధర్ తన ఇంట్లోనే ఉంచాడు. అనంతరం అదే రోజు రాత్రి వాహనంలో మృతదేహాన్ని గోనె సంచిలో తీసుకెళ్లి నవీపేట మండలం కోస్లీ శివారులోని అలీ సాగర్ కాలువ పడేసి పారిపోయాడు. అయితే ఈ ఘటనలో మరి కొంతమంది ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.
చంద్రకళ మృతదేహం కనిపించగానే పోలీసులు వారిదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో చంద్రకళ ఫోన్ కాల్స్ ను పరిశీలించారు. ఆమె మాట్లాడిన చివరి కాల్ గంగాధర్ దే కావడంతో పోలీసుల పని ఈజీ అయిపోయింది. గంగాధర్ ను అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. ప్రస్తుత స్మార్ట్ కాలంలో ఎంత పెద్ద నేరమైనా చిటికలోనే తెలుస్తుంది. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం ఆ స్థాయిలో పెరిగింది కాబట్టి..