Natukodi In Mahabubabad: అది నాటుకోడి పుంజు. దానిని అతడు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ప్రతిరోజు దానికి ఎండు ఫలాలు, ధాన్యపు గింజలు.. ఇంకా రకరకాల పదార్థాలు పెడుతున్నాడు. అతడి పోషణతో అది రోజు రోజుకు ఎదుగుతోంది. ఎదుగుతున్న కోడిపుంజును చూసి అతడు మురిసిపోతున్నాడు.
ఆ కోడిపుంజును ఇలాగే పెంచి.. ఇంకా దాని సంతతిని వృద్ధి చేయాలని అతడు భావిస్తున్నాడు. అతడు ఒక రకంగా అనుకుంటే.. ఓ ట్రాక్టర్ డ్రైవర్ మరో రకంగా చేశాడు. ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో ఆ కోడిపుంజు ట్రాక్టర్ కిందపడి చనిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కోడిపుంజు చనిపోవడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా మరిపెడ మండలం మూల మర్రి తండాకు చెందిన భూక్యా మంచా అనే వ్యక్తి నాటు కోడిపుంజులు అపురూపంగా పెంచుకుంటున్నాడు. అదే అ పుంజు అనుకోకుండా ట్రాక్టర్ కింద పడింది. డ్రైవర్ చూసుకోకపోవడంతో చనిపోయింది. దీంతో ఒక్కసారిగా మంచా దిగ్బ్రాంతి గురయ్యాడు. తన కోడి చనిపోవడానికి కారణం ఇసుక మైనింగ్ మాఫీ అంటూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అతడి ఫిర్యాదును స్వీకరించిన మరిపెడ పోలీసులు ఏకంగా పదకొండు మందిపై కేసు నమోదు చేశారు.
“మూలమర్రి తండా శివారు ప్రాంతంలో ఉన్న పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ గా మైనర్లు వ్యవహరిస్తున్నారు. చివరికి మూగజీవాలను కూడా ఇదే వదిలిపెట్టడం లేదు. ట్రాక్టర్లను వేగంగా నడుపుతూ ఇబ్బంది పడుతున్నారు. నా కోడిపుంజుపై కూడా అలానే ట్రాక్టర్ నడిపి చంపేశారని” మంచా విలేకరులతో వాపోయాడు.
మంచా ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొన్నాడు. అతని ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు గణేష్, దేవా, వాంకుడోత్ రవి, రఘు, నెహ్రూ, చింటూ, సక్రం, సీత్యా, హరీష్, వీరన్న, రమేష్ అనే వ్యక్తులపై మరిపెడ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే తన కోడిపుంజును అకారణంగా చంపిన ఇసుక మాఫియా పై పోరాటం చేస్తూనే ఉంటానని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని మంచా స్పష్టం చేస్తున్నాడు.