Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.. తెలంగాణ కుంభమేళా.. మేడారం మహా జాతర.. మొదలైంది. జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులు జాతర సాగుతుంది. దీంతో బైలెల్లినం తల్లో అంటూ భక్తుల దారులన్నీ మేడారంవైపే సాగుతున్నాయి. నాలుగు రోజుల్లో 2 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈమేరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 6 వేల బస్సులు నడుపుతోంది. మరోవైపు ప్రవేటు వాహనాలు, ఎడ్ల బండల్లలో లక్షల మంది తల్లుల చెంతకు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు నెల ముందుగానే ఏర్పాట్లు చేశారు. నాలుగు దారుల నుంచి వచ్చే వాహనాల క్రమబద్ధీకరణకు ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా సుమారు 5 లక్షల ప్రైవేటు వాహనాలు చేరుకునే అంచనాతో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.
మేడారం వచ్చే దారులివే..
వరంగల్ మార్గం:
ఆరెపల్లి, గుడెప్పాడ్, మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, పస్రా, వెంగళాపూర్, నార్లాపూర్ ద్వారా మేడారం చేరుకుంటాయి. తిరిగి ప్రయాణంలో నార్లాపూర్, బయ్యక్కపేట, గొల్లబుద్దారం, దూదేకులపల్లి, కమలాపూర్ క్రాస్, భూపాలపల్లి, గణపురం క్రాస్‌రోడ్, రేగొండ, పరకాల, అంబాల క్రాస్, కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల, వరంగల్ బైపాస్, కరుణాపురం, చిన్నపెండ్యాల మీదుగా వరంగల్‌కు చేరతాయి.
మహారాష్ట్ర, రామగుండం, కరీంనగర్, కాళేశ్వరం మార్గం..
కాటారం దగ్గర ఎడమవైపు టర్న్ తీసుకుని.. పెగడపల్లి, కాల్వపల్లి, ఊరట్టం పార్కింగ్ ప్రదేశాలకు చేరుకుంటాయి. తిరిగి ఊరట్టం నుంచి నార్లాపూర్, బయ్యక్కపేట, కమలాపూర్ టీ–జంక్షన్‌కు వెళ్లి కుడివైపు తిరిగి కాటారం దారి వేస్తాయి.
ఖమ్మం జిల్లా మార్గం..
భద్రాచలం, మణుగూరు, బయ్యారం, మంగపేట, ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి క్రాస్, కొండాయి ద్వారా ఊరట్టం పార్కింగ్ ప్రదేశానికి చేరతాయి.
పార్కింగ్ దూరం వివరాలు..
మేడారం జాతరలో ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్టాండ్ అమ్మవార్ల గద్దెలకు కేవలం 0.5 కి.మీ దూరంలో ఉంటుంది. జంపన్న వాగుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఊరట్టం 4 కిలోమీటర్లు, కన్నెపల్లి 4 నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. కొత్తూరు పార్కింగ్ సెంటర్ 4 కి.మీ దూరంల ఉంటుంది. చింతల్ పార్కింగ్ కేంద్రం 6 కిలో మీటర్లు, నార్లాపూర్ పార్కింగ్ పాయింట్ 6 కిలోమీటర్లు ఉంటుంది.వెంగళాపూర్ పాక్కింగ్ పాయింట్ 8 కిలోమీటర్లు ఉంటుంది.
ఆలయాలు..
సమ్మక్క తల్లి తీసుకువచ్చే చిలకల గుట్ట మేడారం జాతర ప్రాంతానికి కిలోమీటర్ దూరం ఉంటుంది. పగిడిద్దరాజు గుడి ఉన్న పూనుగుండ్ల మేడారం జాతరకు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గోవిందరాజుల గుడి ఉన్న కొండాయి మేడారం నుంచి 18 కిలోమీటర్లు ఉంటుంది.