Snakebite : సరిగ్గా దశాబ్దాల క్రితం విడుదలైన ఓ సినిమాలో.. కథానాయకుడు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. అతడు పౌర్ణమి రోజుల్లో తన ఒంటిపై చర్మాన్ని కోల్పోతూ ఉంటాడు. ఒకరకంగా తను ఒంటిపై ఉన్న చర్మాన్ని అదేపనిగా తొలగించుకుంటూ ఉంటాడు. చూసేందుకు ఆ దృశ్యం భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత అతని కన్ను పడిన ఏ అమ్మాయి కూడా బతికి బట్ట కట్టదు. అతడి కంటికి నచ్చిన అమ్మాయిని వదిలిపెట్టడు. శారీరకంగా అనుభవించాలి అనుకుంటాడు. అనుభవించిన తర్వాత ఆ అమ్మాయి నురగ కక్కుకొని చనిపోతుంది. వాస్తవానికి ఆ కథానాయకుడికి చిన్నప్పుడే అతడి తండ్రి ఒంట్లో విషం ఎక్కిస్తాడు. ఆ తర్వాత ఆ మనిషి పూర్తిగా విషపూరితంగా మారతాడు. ఒకరకంగా మనిషి రూపంలో ఉన్న పాములాగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
పై ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా ఈ భూమి మీద అటువంటి వ్యక్తి ఉండడు. ఉండే అవకాశం కూడా లేదు. కానీ ఒక వ్యక్తి ఆ సినిమాలో కథానాయకుడిలో కొన్ని లక్షణాలను కలిగి ఉన్నాడు. అవి ఇటీవల జరిగిన ఓ సంఘటన ద్వారా వెలుగులోకి వచ్చాయి. దీంతో అతని గురించి తెలుసుకోవడానికి జాతీయ మీడియా ఆసక్తి ప్రదర్శించింది. స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది. మొత్తంగా అతడు జాతీయస్థాయిలో మారు మోగుతున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అతని కథ ఏమిటంటే…
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కుత్సోడి అనే పేరుతో ఓ ప్రాంతం ఉంది.. అక్కడ సచిన్ అనే ఒక యువకుడు ఉన్నాడు.. స్థానికంగా అతడు బైక్ మెకానిక్ పనిచేస్తున్నాడు. అతడు ఇటీవల పొలం వద్దకు వెళ్ళాడు.. అతడు వెళ్లిన ప్రాంతంలో కాస్త గడ్డి, ఇతర చెట్లు ఉన్నాయి. అతడు అక్కడ బహిర్భూమికి వెళ్ళగా.. చూడకుండా ఒక పామును తొక్కాడు. బుసలు కొట్టుకుంటూ పాము అతడి కాలు మీద కాటు వేసింది. దీంతో అతడు భయపడిపోయాడు. ఈ క్రమంలోనే ఆ పాము కొంతసేపటి తర్వాత గిలాగిలా కొట్టుకుంటూ చనిపోయింది. ఈ విషయాన్ని అతడు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. ఆ తర్వాత చనిపోయిన పామును తన వెంట పట్టుకుని వెళ్ళాడు.
సచిన్ కుటుంబ సభ్యులు అతడిని, చనిపోయిన పామును తీసుకుని హాస్పిటల్ వెళ్లారు. హాస్పిటల్ వెళ్లిన తర్వాత వైద్యుడు ఆ పామును పరిశీలించి.. ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఆ పాము అత్యంత విషపూరితమైనదని.. ఆ పాము కరిచి కూడా చనిపోయిందంటే మామూలు విషయం కాదని పేర్కొన్నాడు. అయితే సచిన్ చిన్నప్పటినుంచి దంతావధానానికి వేప పుల్లలు, కానుగ పుల్లలు, మారేడు పుల్లలు, బర్రింక చెట్టు పుల్లలు ఉపయోగించేవాడు. అందువల్లే అతడి శరీరం ఇలా మారిందని.. చివరికి పాము కాటు వేసినా సరే ఏమీ కావడం లేదు. పైగా అతడిని కాటు వేసిన పాము చనిపోతోంది. సచిన్ వ్యవహారం వెలుగులోకి రావడంతో మీడియాలో అతడు విపరీతంగా కనిపిస్తున్నాడు. జాతీయ మీడియా అయితే అతడి పై ప్రత్యేకమైన కథనాలను ప్రసారం చేస్తోంది.