Hyderabad: నా భార్య నన్ను రోజూ కొడుతోంది.. ప్రాణహాని ఉంది.. రక్షించండి..

ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం పట్టణానికి చెందిన టెమూజియన్ అనే వ్యక్తికి.. రాజోలుకు చెందిన లక్ష్మీ గౌతమితో ఏడు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 20, 2024 12:03 pm

Wife Beats Her Husband

Follow us on

Hyderabad: ఇప్పటిదాకా భార్యలను కొట్టిన మగాళ్ళనే చూసాం.. మగాళ్లు పెడుతున్న ఇబ్బందులను తట్టుకోలేక పోలీసు స్టేషన్ల గడప తొక్కిన ఆడవాళ్లనే చూసాం. కానీ ఇది విచిత్రమైన కేసు.. భార్య నుంచి వస్తున్న వేధింపులను.. ఆమె పెడుతున్న ఇబ్బందులను తట్టుకోలేక ఒక భర్త వీధికెక్కాడు. చివరకు పోలీసులను ఆశ్రయించాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం పట్టణానికి చెందిన టెమూజియన్ అనే వ్యక్తికి.. రాజోలుకు చెందిన లక్ష్మీ గౌతమితో ఏడు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. టెమూజియన్ హైదరాబాదులోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. తన భార్యతో కలిసి అల్వాల్ లో నివాసం ఉంటున్నాడు. వీరిద్దరికి ఐదు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అయితే పెళ్లయిన నాటి నుంచి లక్ష్మీ గౌతమి టెమూజియన్ ను అకారణంగా హింసిస్తోంది. ఆమె చేతిలో దెబ్బలు తట్టుకోలేక టెమూజియన్ పలుమార్లు పెద్దమనుషులను ఆశ్రయించాడు. వారు ఆమెకు సర్ది చెప్పినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. అంతేకాదు ఇటీవల టెమూజియన్ ను చంపేందుకు కత్తితో దాడికి పాల్పడింది. దీనిపై అతడు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఫిర్యాదును స్వీకరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని టెమూజియన్ ఆరోపిస్తున్నాడు.. చట్టాల అమలు విషయంలో పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని టెమూజియన్ విమర్శిస్తున్నాడు. అందుకే తాను ఇంటికి వెళ్లడం లేదని.. ఇంటికి వెళ్తే తన భార్య మళ్ళీ దాడి చేస్తుందని అతడు భయపడుతున్నాడు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నాడు..

తన భార్య పెడుతున్న చిత్రహింసల నుంచి కాపాడాలంటూ టెమూజియన్ హైదర్ గూడ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో టెమూజియన్ తల్లిదండ్రులు కూడా అతడి వెంట ఉన్నారు. ఈ సమయంలో అతడు తన భార్య చేసిన గాయాలను విలేకరులకు చూపించాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులకు విన్నవించాడు. ఇప్పటికే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశానని.. ఇంతవరకూ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని టెమూజియన్ ఆరోపించాడు.. తన భార్య నుంచి తనకు మాత్రమే కాదని, తల్లిదండ్రులకు కూడా ప్రాణహాని ఉందని టెమూజియన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె పెడుతున్న శారీరక హింస నుంచి తాను తట్టుకోలేకపోతున్నానని కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.