Village festival tragedy: నేటి కాలంలో ఉత్సవాలు, వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంట్లో సంబరాలైనా, పండుగలైనా అద్భుతంగా జరుపుకుంటున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. పైగా విందులు, చిందులు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఉత్సాహంతో డ్యాన్సులు వేయడం.. ఆనందంతో సంబరాలు జరుపుకోవడం నేటి కాలంలో పరిపాటిగా మారింది. ఆర్థిక స్థిరత్వం పెరగడంతో చాలామంది చిందులు వేయడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. అలా ఓ వేడుకలో డ్యాన్సులు వేస్తున్న ఓ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. కళ్ళు తెరిచి చూసేలాగా దారుణం చోటుచేసుకుంది.
విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా దసరా తర్వాత గ్రామదేవతలకు ఉత్సవాల నిర్వహిస్తారు. వాటిని అనుపు ఉత్సవాలు అని పిలుస్తుంటారు. ఈ ఉత్సవాలలో అమ్మవారి విగ్రహాలను ఊరేగిస్తుంటారు. అన్ని వీధులలో అమ్మవారి శోభాయాత్ర నిర్వహించి.. అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని ప్రార్థిస్తారు. అయితే ఇలా అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తున్న సమయంలో జరిగిన ఘోరం విషాదాన్ని నింపింది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పెద్దగాడి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన అప్పికొండ త్రినాథ్, తన భార్యతో కలిసి అమ్మవారి ఉత్సవంలో పాల్గొన్నాడు. వారిద్దరు కలిసి డ్యాన్సులు వేశారు. భార్యాభర్త పోటాపోటీగా డాన్సులు వేయడంతో సందడి వాతావరణం ఏర్పడింది. దీంతో చాలామంది వారిని ఉత్సాహపరిచారు. వారిద్దరూ డ్యాన్స్ చేస్తుంటే ఈలలు వేస్తూ.. కేరింతలు కొట్టారు. అప్పటిదాకా డాన్స్ చేసిన త్రినాధ్.. ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. డాన్స్ చేస్తుండగానే కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు చెప్పారు. అప్పటిదాకా అతడు స్టెప్పులు వేసి ఆకట్టుకున్నాడు. చూస్తుండగానే కన్నుమూయడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
డీజే శబ్దాలకు అతడు డ్యాన్స్ వేయడంతోనే ఉన్నట్టుండి హృదయ స్పందన వేగం పెరిగిందని.. అందువల్లే అతడు కుప్పకూలిపోయాడని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా మరణాలు పెరిగిపోతున్నాయి. డీజే శబ్దం అధికంగా ఉండడం వల్ల అది హృదయ స్పందన వేగాన్ని ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు డీజే శబ్దాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. డిజె శబ్దాలకు ఒకవేళ డాన్సులు చేయాలి అనుకుంటే.. ధ్వని తీవ్రతను తగ్గించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఒక వయసు దాటిన తర్వాత ఇలాంటి డ్యాన్సులు వేయకపోవడమే మంచిదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఆ వయసులో శరీరంలో రకరకాల మార్పులు జరుగుతుంటాయి. అధిక ఒత్తిడి వల్ల హృదయం లాంటి అవయవాల మీద ప్రభావం చూపిస్తే.. అది అంతిమంగా మరణానికి దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు.