Homeక్రైమ్‌400 Crore Container Hijack: రెండు కంటైనర్లు.. 400 కోట్లు.. బిజెపి, కాంగ్రెస్ పంచాయితీ!

400 Crore Container Hijack: రెండు కంటైనర్లు.. 400 కోట్లు.. బిజెపి, కాంగ్రెస్ పంచాయితీ!

400 Crore Container Hijack: ధూమ్ సినిమా చూశారా.. ఇప్పటికీ ఆ సినిమా మూడు భాగాలుగా వచ్చింది. అందులో ప్రతిభాగంలో హీరో దొంగ. దారి దోపిడికి పాల్పడుతూ ఉంటాడు. వందల కోట్లు చూస్తుండగానే దొంగతనం చేస్తూ రెప్పపాటులో మాయమవుతుంటాడు. అలాంటివి సినిమాలోనే సాధ్యమవుతాయి. నిజ జీవితంలో జరగవని చాలామంది అనుకుంటారు. కానీ, అలాంటివి జరుగుతాయని.. వందల కోట్లు మాయమవుతాయని ఈ సంఘటన నిరూపించింది.

జనవరి 26 దేశవ్యాప్తంగా జండా వందనం జరిగింది. కానీ, ఆ వేడుకల గురించిన ఒక వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు రెండు కంటైనర్లలో వస్తున్న 400 కోట్ల నగదు మాయమైందని ఆ వార్త సారాంశం. గుజరాత్ నుంచి రెండు కంటైనర్లలో 400 కోట్లతో బయలుదేరిన వాహనాలు కర్ణాటకలో దారి దోపిడికి గురయ్యాయి. గుజరాత్ మీదుగా మహారాష్ట్ర, గోవా, తిరుపతి వైపు ఆ వాహనాలు వెళ్తుండగా కర్ణాటకలో దారి దోపిడికి గురయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంపై మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ దారిదోపిడి సంఘటన జరిగిందన్న విషయం తమకు తెలియదని కర్ణాటక అధికారులు చెబుతున్నారు. అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి రకరకాల వార్తలు మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఈ 400 కోట్లు ఎన్నికల్లో పంచడానికి రవాణా చేస్తున్న డబ్బు అని అటు కాంగ్రెస్, ఇటు బిజెపి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో నాసిక్ గ్రామీణ ప్రాంతానికి చెందిన పోలీస్ స్టేషన్లో నిర్వహించడానికి డిసెంబర్ 17న సందీప్ దత్త పాటిల్ అనే వ్యక్తి ఒక ఫిర్యాదు చేశాడు. ” నా పేరు సందీప్. గతేడాది అక్టోబర్ 22న విశాల్, కిషోర్ అనే వ్యక్తులు నన్ను అపహరించారు. నన్ను అపహరించమని చెప్పింది విరాట్ అనే వ్యక్తి. గత ఏడాది అక్టోబర్ 22న 400 కోట్లతో రెండు కంటైనర్లు బయలుదేరాయి. అవి దారి దోపిడి కి గురయ్యాయి. ఆ డబ్బులు తస్కరించింది నేనే అంటూ వారు నన్ను ఇబ్బంది పెట్టారు. దాదాపు 45 రోజులపాటు నన్ను తీవ్రంగా వేధించారు. అతి కష్టం మీద నేను తప్పించుకున్నాను. బయటికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నాను. దానికి సంబంధించిన వివరాలు మొత్తం నా దగ్గర ఉన్నాయని” సందీప్ పోలీసులతో పేర్కొన్నాడు. పోలీసులకు ఫిర్యాదు కంటే ముందు సందీప్ ఒక వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు..

సందీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో 400 కోట్లకు బదులుగా 1000 కోట్లు అని చెప్పడం విశేషం. ఈ వీడియో తర్వాత మహారాష్ట్ర పోలీసులు ఒక్కసారిగా స్పందించారు. భారీగా నగదు.. ఇందులో రాజకీయ పార్టీల ప్రమేయం ఉండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని విచారణ నిమిత్తం ఏర్పాటు చేసింది. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక విచారణ బృందం అధికారులు జనవరి 16న కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లా ఖానా పూర పోలీస్ స్టేషన్ కు ఓ లేఖ రాశారు. కేసు దర్యాప్తులో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కేసు పై బెలగావి ఎస్పీ రామరాజన్ విలేకరులతో మాట్లాడారు. ” ఈ వ్యవహారంలో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెలగావి, గోవా మార్గంలోని చోర్లా ఘాట్ ప్రాంతంలో ఈ దొంగతనం జరిగినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం పంపిన లేఖలో స్పష్టమైన సమాచారం లేదు.. ఇది సమర్థవంతమైన సమాచారం లాగా అనిపించడం లేదు. కేసు నమోదు చేయాలంటే ఇటువంటి రోజులు కనిపించడం లేదు. ఈ నగదు పోగొట్టుకున్న వారు ఫిర్యాదు కూడా చేయలేదు. ఆ వాహనాల నంబర్లు కూడా మాకు ఇవ్వలేదు. అయితే ఈ కేసు వ్యవహారాన్ని పరిశీలించాలని మా పోలీసు అధికారులను అక్కడికి పంపించామని” రామ రాజన్ వెల్లడించారు.

మరోవైపు ఈ సొమ్మును అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పంచడానికి కాంగ్రెస్ నేతలు తరలిస్తున్నారని బిజెపి ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను కర్ణాటక మంత్రులు ఇప్పటికే ఖండించారు. ఈ దోపిడీకి సంబంధించి మహారాష్ట్ర పోలీసులు సమాచారం అందించాలని.. మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే గోవా వరకు బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయని.. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో కొంతమంది గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు ఉన్నారని.. కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version