Karimnagar News: ఇంటి నిండా మాయ, బయట మృత్యు ముసుగు. సర్వసాధారణంగా కనిపించి భర్తను నమ్మించిన ఓ భార్య ఆడిన ఘోర నాటకం ఇప్పుడు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. యూట్యూబ్ వీడియోల్లో హత్య చేసే పద్ధతులు చూసి.. భర్తను ఎలా మోసగించాలో ప్రణాళిక రచించిన భార్య, ప్రియుడి సహకారంతో తన జీవిత భాగస్వామిని హత్య చేసిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది.
Also Read: తెలంగాణలో జానపద గీతాల వైభవం.. ఆంధ్రాలో ఎందుకు లేదు..
– వివాహేతర సంబంధమే ఘోరానికి దారి
కరీంనగర్ గ్రంథాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్న సంపత్ (45), భార్య రమాదేవి, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. రమాదేవి సర్వపిండి తయారు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమె వద్ద తరచూ సర్వపిండి కొనుగోలు చేస్తూ వచ్చి పరిచయం పెంచుకున్న కర్రె రాజయ్య (50), కొంతకాలానికి ఆమెతో వివాహేతర సంబంధం కలిగి జీవితం గడుపుతున్నాడు.
– యూట్యూబ్‌తో పాఠాలు.. ప్రణాళికతో హత్య!
సంపత్ అడ్డు తొలగించాలి అనే ఆలోచనతో రమాదేవి.. యూట్యూబ్‌లో హత్య పద్ధతులు గూగుల్ చేస్తూ “చెవిలో గడ్డి మందు పోస్తే చనిపోతాడు” అనే వీడియోను చూసి అదే పద్ధతిని అమలు చేయాలని రాజయ్యకు తెలిపింది.
– మద్యం మత్తులో మృత్యువుకు తోడు
జూలై 31న రమాదేవి, రాజయ్య, అతని మిత్రుడు శ్రీనివాస్ కలిసి సంపత్‌ను బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించారు. మత్తులో తూలుతూ పడిపోయిన సమయంలో రాజయ్య, శ్రీనివాస్ కలిసి చెవిలో గడ్డి మందు పోసి హత్య చేశారు. మరుసటి రోజు రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ భర్త కనిపించడం లేదని నాటకమెరిపింది.
– అనుమానాలు.. సాక్ష్యాలతో దొరికిన నేరం
ఆగస్టు 1న మృతదేహం లభించగా, రమాదేవి పోస్టుమార్టం చేయవద్దని కోరడంతో ఆమెపై అనుమానం కలిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కాల్ డేటా, మొబైల్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తాము హత్య చేసినట్లు అంగీకరించారు.
– ముగ్గురూ అరెస్టు.. చట్టబద్ధమైన చర్య
రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నైతిక విలువలు పతనమై.. యూట్యూబ్ చూపిన మార్గంలో నడవడమంటే ఇదే కాబోలు అని స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.