Janmashtami Celebrations Turn Tragic: ఎంత ఉత్సాహంగా వారు కృష్ణాష్టమి వేడుకలు జరిపారు. ఎప్పటి మాదిరిగానే కృష్ణుడిని రథంలో ఉంచి ఊరేగించారు. ఈసారి వాతావరణం చల్లగా ఉండడంతో రాత్రి పొద్దుపోయే వరకు ఊరేగింపు జరిపారు. శ్రీకృష్ణుని పాటలు పెట్టుకుంటూ.. నృత్యాలు చేసుకుంటూ నల్లనయ్య మీద భక్తి భావాన్ని ప్రదర్శించారు.. చివరికి స్వామివారిని, ఆయన ప్రయాణించిన రథాన్ని ఒక ఫంక్షన్ హాల్ లో భద్రపరిచేందుకు వెళుతుండగా దారుణం జరిగింది.
రామంతపూర్ ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 24 సంవత్సరాల క్రిష్ణ యాదవ్ కూడా కన్నుమూశాడు. అయితే అతనికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అది అందరిని కంటనీరు తెప్పిస్తోంది. కృష్ణ యాదవ్ వయసు 24 సంవత్సరాలు. వాళ్ళ కుటుంబంలో ఒకే ఒక్క మగపిల్లాడు. అతడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.. అతడు కూడా ఉన్న చదువులు చదివి.. ఓ సంస్థలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. కృష్ణాష్టమి వేడుకలు కావడంతో స్థానికులతో కలిసి సంబరాలలో పాల్గొన్నట్టు తెలిసింది. పైగా అతడిది యాదవ సామాజిక వర్గం కావడంతో ఈసారి రెట్టించిన ఉత్సాహంతో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. పైగా ఇతర కుటుంబ సభ్యులకి కృష్ణుడు అంటే విపరీతమైన ప్రేమ కాబట్టి అతడికి కృష్ణ యాదవ్ అనే పేరు పెట్టుకున్నారు.
Also Read: యూట్యూబ్ వీడియో.. చిన్నారి ప్రాణం కాపాడింది..
కృష్ణ యాదవ్ చిన్నాన్నకు, పెదనాన్నకు అమ్మాయిలే సంతానం. కృష్ణ యాదవ్ మాత్రమే ఆ వంశానికి వారసుడు. సోమవారం తెల్లవారుజామున రామంతపూర్ ప్రాంతంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో కృష్ణ యాదవ్ చనిపోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు విద్యుత్ ప్రమాదంలో కన్నుమూయడంతో తట్టుకోలేకపోతున్నారు. కృష్ణ యాదవ్ మృతిని అతని స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. రామంతపూర్ విద్యుత్ ప్రమాదంలో ఐదుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాధ.. ఇందులో కృష్ణ యాదవ్ ది మరింత విషాదం.