https://oktelugu.com/

Gadwal: వార్నీ.. బజ్జీల కోసం అంత పనిచేశావా? ఇదేం యవ్వారం స్వామీ

నేరాలు చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి. నేరం చేయడానికి ఒకప్పుడు భయపడేవారు. కానీ, ఇప్పుడు మద్యం, గంజాయి మత్తులో ఎంతటి దారుణానికైనా వెనుకాడడం లేదు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 1, 2024 / 11:37 AM IST

    Gadwal

    Follow us on

    Gadwal: నేరం చేయాలంటే భయపడాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి. కోర్టులు కఠిన శిక్షలు విధిస్తున్నాయి. దీంతో గతంలో నేరం చేయడానికి చాలా మంది భయపడేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, మానసిక ఒత్తిడి, మద్యం, గంజాయి మత్తు కారణంగా ఎంతటి నేరం చేయడానికీ కూడా వెనుకాడడం లేదు. నడి రోడ్డుపై మనుషులను నరుకుతున్న ఘటనలు.. మహిళలను చంపి ముక్కలుగా కోసి బ్యాగులో మూటగట్టి పడేస్తున్న ఘటనలు, ఫ్రిజ్‌లో శవాలను దాచిపెడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఇక కొంత మంది రూ.50, రూ.100 కోసం గొడవ పడి అయినవారిని కూడా అంతం చేస్తున్నారు. క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను, తల్లిదండ్రులను చంపిన ఘటనలూ ఉన్నాయి. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని, డబ్బులు అడిగితే అరువు ఇవ్వలేదని కూడా కొంతమంది దాడులు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. బజ్జీలు అరువు ఇవ్వలేదని ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు

    మరుగుతున్న నూనె పోశాడు..
    జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నెకు చెందిన బొజ్జన్న గౌడ్‌ స్థానికంగా మిర్చీ బజ్జీల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వినోద్‌ అనే వ్యక్తి బజీలు కావాలని బొజ్జన్న దుకాణానికి వచ్చాడు. అయితే ప్రస్తుతం డబ్బులు లేవని, తర్వాత ఇస్తానని అడిగాడు. అయితే అరువు ఇవ్వడం లేదని బొజ్జన్న తెలిపాడు. దీంతో అరువు ఎందుకు ఇవ్వవని వినోద్‌ గొడవ పడ్డాడు. ఆగ్రహంతో ఊగిపోయిన వినోద్‌.. అక్కడే సలసల కాగుతున్న కళాయిలోని నూనెను బొజ్జన్నపై పోశాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న మరో వ్యక్తి వీరేశ్‌పై నూనె పడింది. దీంతో అతడి ముఖం కాలిపోయింది.

    క్షణికావేశంలో దారుణం..
    కేవలం బజ్జీల కోసం క్షణికావేశానికి లోనైన వినోద్‌ క్రూరంగా ప్రవర్తించాడు. బజ్జీల దుకాణం యజమానిని చంపేందకు కూడా వెనుకాడలేదు. గాయపడిన వీరేశ్‌ను ఆస్పత్రికి తరలించిన స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వినోద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మద్య మత్తు కారణంగానే వినోద్‌ ఇలా క్రూరంగా వ్యవహరించాడని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.