Hyderabad Rave Party: చేతిలో డబ్బుంది. అంతకుమించి విస్తారమైన ఆస్తిపాస్తులున్నాయి. పైగా రాజకీయాలు చేసిన అనుభవం ఉంది. కింది నుంచి పై స్థాయి దాకా పలుకుబడి ఉంది. ఇన్ని ఉన్న తర్వాత వారు ఊరికే ఎందుకు ఉంటారు. అందుకే పిచ్చి పనులు మొదలుపెట్టారు. చివరికి అడ్డంగా దొరికిపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
హైదరాబాద్ నగరం విపరీతంగా విస్తరించింది. ప్రధాన నగరం కాంక్రీట్ జంగిల్ గా మారింది. దీంతో రాజకీయ నాయకులు శ్రీమంతులు శివారు ప్రాంతాలలో తమ పెట్టుబడులను మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే అక్కడ వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. నగరానికి దూరంగా ఉండడం.. సభ్య సమాజానికి దూరంగా ఉండడంతో అక్కడ పాడు పనులు మొదలుపెట్టారు. వేడుకలు చేసుకోవడం.. అశ్లీల నృత్యాలు చేయడం.. విపరీతంగా మద్యం తాగడం.. భారీగా శబ్దాలు పెట్టుకొని డ్యాన్సులు వేసి లోకాన్ని మర్చిపోవడం వంటివి వ్యవసాయ క్షేత్రాలలో పరిపాటిగా మారుతున్నాయి.. అలా కొంతమంది రాజకీయ నాయకులు చేసిన ఓ దిక్కుమాలిన పని ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది.
హైదరాబాద్ నగరంలోని కాచిగూడ ప్రాంతానికి చెందిన రుద్రశెట్టి సప్తగిరి అనే వ్యక్తి తన వ్యవసాయక్షేత్రంలో స్నేహితుల కోసం ఓ పార్టీని ఏర్పాటు చేశాడు. అందులో డ్యాన్సులు వేయడానికి ముంబై, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గాజువాక ప్రాంతాల నుంచి 8 మంది మహిళలని రప్పించాడు. గడిచిన బుధవారం సాయంత్రం ఈ పార్టీ మొదలైంది. సప్తగిరి స్నేహితులు చందంపేట ఆనంద్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ మధుగౌడ్, మిగతా ప్రాంతాలకు చెందిన 24 మందిని సప్తగిరి ఆహ్వానించాడు. వీరంతా కూడా అక్కడి వ్యవసాయ క్షేత్రంలో మైకంలో మునిగి తేలారు. అమ్మాయిలతో డ్యాన్సులు వేస్తూ రెచ్చిపోయారు. భారీ శబ్దాలతో అక్కడ హడావిడి చేస్తుంటే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు పకడ్బందీగా అక్కడికి వెళ్లారు.
పోలీసులు అక్కడికి వెళ్లిన తర్వాత పురుషులు మద్యం తాగుతున్నారు. మహిళలు ఏమో రాయడానికి వీలు లేని స్థితిలో నృత్యాలు చేస్తున్నారు. మహిళలందరికీ భారీగా ముట్ట చెప్పి ఇక్కడ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. వారు కూడా మద్యం తాగి డ్యాన్సులు వేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆనంద్ కుమార్ గౌడ్ భారత రాష్ట్ర సమితి నాంపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. మధు గౌడ్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ సోదరుడిగా ఉన్నారు. గతంలో ఈయన గన్ ఫౌండ్రీకి మాజీ కార్పొరేటర్ గా పనిచేశారు. వీరిద్దరి మాత్రమే కాకుండా కార్పొరేటర్లు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ నిర్వాహకులు ఈ పార్టీలో పాల్గొన్నారు. అనుమతి లేకుండానే వీరంతా కూడా పార్టీ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. మంచాల మండలం లింగంపల్లి శివారు ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ వేడుక జరిగింది. ఇందులో మొత్తం 25 మంది పురుషులు, 8 మంది మహిళలు పాల్గొన్నారు. సంఘటన స్థలం నుంచి 2.45 లక్షల నగదు, 25 ఫోన్లు, 11 కార్లు, 27 మద్యం సీసాలు, భారీ సామర్థ్యం ఉన్న స్పీకర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలుకుబడి ఉన్న నాయకులు మొత్తం స్టేషన్ బెయిల్ ద్వారా బయటికి వచ్చినట్టు తెలుస్తోంది.