IND Vs AUS: మరో రెండు రోజుల్లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ మొదలు కాబోతోంది. పెర్త్ వేదికగా తొలి వన్డే జరగనుంది. వన్డే ర్యాంకింగ్ లో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఉత్కంఠ తారస్థాయిలో ఉంది. పైగా టీమిండియాలోకి రోహిత్, విరాట్ పునరాగమనం చేసిన నేపథ్యంలో పోటీ హోరాహోరీగా ఉంటుందని అంచనాలున్నాయి. పైగా మైదానంలో రోహిత్, విరాట్ చెమటలు చిందిస్తున్నారు. బ్యాట్ తో ప్రాక్టీస్ చేస్తున్నారు. గంటల తరబడి నెట్స్ లో సాధన చేస్తున్నారు.
విరాట్, రోహిత్ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో.. జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా తిరుగులేని స్థాయిలో ఉంది. ఆతిధ్య జట్టు మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు జంపా, ఇంగ్లిస్ వ్యక్తిగత కారణాలవల్ల తొలి వన్డేకు దూరమయ్యారు. ప్రస్తుతం జంపా అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తో అదరగొడుతున్నాడు. ఇంగ్లిస్ కూడా సత్తా చూపిస్తున్నాడు. వీరిద్దరూ తొలి వన్డేకు దూరం కావడంతో ఆ ప్రభావం జట్టు మీద పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగానే మరో ఆటగాడు ఆస్ట్రేలియా జట్టుకు దూరమయ్యాడు. భీకరమైన ఫామ్ లో ఉన్న కామెరున్ గ్రీన్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడు కొంతకాలంగా కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. నీతో అతడిని పరీక్షించిన వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో అతని స్థానంలో లబుషేన్ ను జట్టులోకి తీసుకున్నట్టు ఆస్ట్రేలియా మీడియా ప్రకటించింది.
అక్టోబర్ 19న తొలి వన్డే పెర్త్ వేదికగా జరుగుతుంది. రెండవ వన్డే 23న అడిలైడ్ లో, 25న మూడో వన్డే సిడ్నీలో జరుగుతుంది.. అయితే ఈ మూడు మైదానాలలో పిచ్ లను బౌన్సీగా రూపొందించినట్టు తెలుస్తోంది. మన జట్టు ప్లేయర్లకు సవాల్ విసిరే విధంగా ఇక్కడి పిచ్ లు ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మైదానాలలో ఆస్ట్రేలియా జట్టుకు తిరుగులేని రికార్డు ఉంది. కీలక ప్లేయర్లు లేకపోయినప్పటికీ ఆస్ట్రేలియా జట్టులో ఆటగాళ్లు మొత్తం అద్భుతంగా ఆడతారు. ఏ సమయంలోనైనా ఫామ్ లోకి వస్తారు. అందువల్లే టీమిండియా జాగ్రత్తగా ఉండాలని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు ఈసారి టీమిండియా గిల్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా గడ్డమీద అడుగుపెట్టింది. సారధిగా అతడికి ఇది తొలి వన్డే సిరీస్. పైగా విదేశాలలో ఆడుతున్న నేపథ్యంలో అతనిపై ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతడిని సారధిగా ఉంచాలని మేనేజ్మెంట్ నమ్మకంతో ఉంది. అందువల్ల అతడు ఈ సిరీస్లో జట్టును గనుక విజయ పథం లో నడిపితే తిరుగుండదని తెలుస్తోంది.