Karimnagar: అది తెలంగాణ రాష్ట్రం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని శివరాంపల్లి గ్రామం. ఈ గ్రామానికి చెందిన ఓ దంపతుల చిన్న కూతురు (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. చలాకి గా ఉండే ఆ అమ్మాయి ఉన్నట్టుండి చనిపోయింది. ఆమెకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. ఆమె చనిపోయిన విధానం కూడా అనుమానాస్పదంగా ఉంది. ఇంత పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో విచారణ మొదలుపెట్టారు. ఈ వ్యవహారంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
హుజురాబాద్ ఏసిపి మాధవి వెల్లడించిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలంలోని శివరాంపల్లి గ్రామానికి చెందిన ఓ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇందులో చిన్న కుమార్తె వయసు 16 సంవత్సరాలు. ఆమె ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల ఆ బాలిక అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది. అయితే అప్పటికే అతనికి వివాహం జరిగింది. ఈ విషయం ఆ బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. ప్రవర్తనను మార్చుకోవాలని తల్లిదండ్రులు ఆమెను హెచ్చరించారు. అయినప్పటికీ ఆ బాలిక తన పద్ధతి మార్చుకోలేదు.
గత నెల 14న ఆ బాలిక నిద్రిస్తుండగా కుటుంబ సభ్యులు బలవంతంగా పురుగుల మందు తాగించారు. ఆ తర్వాత ఆమె తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు. అతడికి భార్య కూడా సహకరించింది. మరుసటి రోజు తమ కుమార్తె పురుగుల మందు తాగి చనిపోయిందని పోలీసులకు ఆ బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం లో గొంతు నులిమినట్టు తేలింది. వివాహం జరిగిన యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగించడం తట్టుకోలేక తాము ఈ దారుణానికి పాల్పడినట్టు విచారణలో ఆ బాలిక తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఏసిపి మాధవి విలేకరులతో స్పష్టం చేశారు. తమ విచారణ సాగిస్తుండగానే వారు నేరని అంగీకరించాలని ఆమె పేర్కొన్నారు. నిందితుల పై కేసు నమోదు చేసిన పోలీసులు.. జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.
ఈ కేసులో అనేక విధాలుగా విచారణ సాగించిన పోలీసులు.. కీలక వివరాలను తెలుసుకున్నారు. ఆ బాలిక ప్రేమ వ్యవహారం సాగించిన యువకుడి గురించిన వివరాలు కూడా పోలీసులు తెలుసుకొన్నట్లు తెలుస్తోంది. అందువల్లే ఈ కేసులో పోలీసులు త్వరితగతిన పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. కన్న కుమార్తెను తల్లిదండ్రులు అంతం చేయడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం నెలకొంది.