Phone Tapping Case: భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన వ్యక్తుల ఫోన్ లు ట్యాప్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నాడు ఇంటిలిజెన్స్ భాగంలో కీలకంగా పనిచేసిన ప్రభాకర్ రావు, భుజంగరావు, రాధా కిషన్ రావు, తిరుపతన్న ను అనేక దఫాలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. వీరు మాత్రమే కాకుండా ఓ మీడియా సంస్థను నిర్వహిస్తున్న శ్రవణ్ రావు అనే వ్యక్తిని కూడా విచారించింది. ప్రభాకర్ రావు ను ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం గదిలో అధికారులు విచారించారు. మిగతా వారిని కూడా విచారించడానికి అదే విధానాన్ని కొనసాగించారు. చార్జిషీట్, సుప్రీంకోర్టుకు అందించే నివేదికలో ఏమాత్రం తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది ప్రత్యేక దర్యాప్తు బృందం. నిందితుల కన్ ఫెషన్ రిపోర్ట్ లో పలు అంశాలను పేర్కొనగా… వాటి ఆధారంగా తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. అంతేకాదు రిమాండ్ రిపోర్టులు, ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ లో అంశాలతో సిట్ అధికారులు దాదాపుగా డ్రాప్టింగ్ పూర్తి చేశారు.
సిట్ విచారిస్తున్న సమయంలో ప్రభాకర్ రావుకు సంబంధించిన మన వ్యవహారం కూడా వెలుగు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రభాకర్ రావు తనను ఇబ్బంది పెట్టారని సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులకు ఫిర్యాదు చేశాడు. తనను బెదిరింపులకు గురిచేసి భారత రాష్ట్ర సమితికి 12 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు రాయించాడని శ్రీధర్ రావు ఆరోపించారు. అంతేకాదు, ఓ భూ వివాదంలో ప్రభాకర్ వియ్యంకుడు రవీందర్రావు కొంత డబ్బు కూడా వచ్చిందని శ్రీధర్ రావు సిట్ కు చేసిన ఫిర్యాదులో స్పష్టం చేశాడు. దీంతో రవీంద్రరావు సిట్ దర్యాప్తు చేసింది. మరోవైపు ప్రభాకర్ రావు పెద్ద కుమారుడు నిశాంత్ ను ఇప్పటికే సిట్ అధికారులు అనేక దఫాలుగా విచారించారు. నిశాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన పెట్టుబడులు, ఇతర వ్యవహారాల గురించి పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ప్రభాకర్ రావు, నిశాంత్ బ్యాంకు ఖాతాలను సిట్ అధికారులు లోతుగా పరిశీలించారు.
సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత తదుపరి వ్యవహారాన్ని కొనసాగించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావు విచారణ ముగియడంతో సిట్ చీఫ్ సజ్జనార్, ఇంటలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, సిద్దిపేట సిపి ఎస్ఎం విజయ్ కుమార్ సహా సిట్ సభ్యులు భేటీ అయ్యారు. బంజారాహిల్స్ ప్రాంతంలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఈ కీలక సమావేశం నిర్వహించారు. ప్రభాకర్ రావు ను విచారించిన తర్వాత కేసు విషయంలో కీలకమైన నివేదిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు సుప్రీంకోర్టులో దాఖలు చేసే స్టేటస్ రిపోర్ట్ కూడా పూర్తి చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ కెసిఆర్ ను విచారణకు పిలిస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని అంశాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.