Mahabubnagar: కన్న తల్లి ప్రేమ ప్రపంచానికి కనిపిస్తుంది. కన్నతండ్రి ప్రేమ కనీసం పక్కింటి వ్యక్తులకు కూడా కనిపించదు అంటారు. తండ్రి ప్రేమకు గుర్తింపు ఉండదు. తండ్రి త్యాగానికి ఉపమానం ఉండదు. అందువల్లే తండ్రి ప్రేమను ఈ ప్రపంచం గుర్తించదు.. కానీ పిల్లల విషయంలో తండ్రి నిత్యం తపన పడుతూనే ఉంటాడు. తల్లి కడుపులో మోస్తే.. తండ్రి భుజాల మీద ఎత్తుకొని లోకాన్ని చూపిస్తాడు. తన కాళ్ళ మీద తాను నిలబడే వరకు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు.
తండ్రి ప్రేమకు నిర్వచనం ఉంటే అది గొప్ప గ్రంథం అవుతుంది. తండ్రి త్యాగానికి కొలమానం ఉంటే అది అనిర్వచనీయ కావ్యమవుతుంది. తల్లి వాత్సల్యాన్ని మాత్రమే పొగిడే ఈ ప్రపంచం.. తండ్రిని మాత్రం ఎందుకో లెక్కలోకి తీసుకోదు. కానీ ఈ కథనం చదివిన తర్వాత తల్లి ప్రేమ కంటే తండ్రి త్యాగమే గొప్పగా అనిపిస్తుంది. తల్లి చూపించిన వాత్సల్యానికంటే తండ్రి ప్రదర్శించిన ఉదారత అద్భుతంగా అనిపిస్తుంది.
అది తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లా.. పాలమూరు జిల్లా కేంద్రంలోని ప్రేమనగర్ ప్రాంతంలో బాలరాజ్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు పేరు హరీష్. ఇతడికి ఎన్ని సంవత్సరాలు వరకు వయసు ఉంటుంది. పెద్ద కుమారుడు దివ్యాంగుడు. బాలరాజు స్థానికంగా ఉన్న ఒక పత్తి మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల పత్తి మిల్లు మూతపడింది. దీంతో ఉపాధి లేక బాలరాజు స్థానికంగా ఉన్న హోటల్లో పనిచేయడం మొదలుపెట్టాడు. అయితే భర్తతో గొడవపడి భార్య తన రెండవ కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో బాలరాజు హోటల్లో పనిచేస్తూ పెద్ద కుమారుడిని పోషిస్తున్నాడు.
పెద్ద కుమారుడు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అది కాస్త అతడి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో ఆ పిల్లాడు చనిపోయాడు. ఫలితంగా బాలరాజు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కొడుకు శవాన్ని తీసుకొని స్మశాన వాటికకు వెళ్ళాడు. దహన సంస్కారాలు నిర్వహించడానికి డబ్బులు లేకపోవడంతో ఎనిమిది గంటల పాటు స్మశాన వాటికలోనే మృతదేహాన్ని పట్టుకొని ఉన్నాడు. ” బతికి ఉన్నప్పుడు కనీసం కడుపునిండా తిండి కూడా పెట్టలేదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేసే సామర్థ్యం కూడా లేదు..” అంటూ విలపించాడు.
బాలరాజు దుస్థితిని చూసిన కొంతమంది చలించి పోయారు. హరీష్ అంత్యక్రియల కోసం తమవంతుగా తోడ్పాటు ఇచ్చారు. ఆ తర్వాత అతడిని ఊరడించారు. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా బాలరాజు భార్య అక్కడికి రాకపోవడం విశేషం. కొడుకు చనిపోయిన సమాచారం ఆమెకు ఇచ్చినా కూడా ఆమె స్పందించలేదని బాలరాజు వాపోయాడు.