Gnaneswari Missing Case: తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడడం లేదు. ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. వందలాదిమంది పోలీసులు జల్లెడ పడుతున్నారు. కానీ కనీసం క్లూ కూడా దొరకడం లేదు. కిడ్నాప్ కోణంలో దర్యాప్తు జరుగుతూ వస్తోంది. మరోవైపు చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన కుక్క రావడం.. దానికి జిపిఆర్ఎస్ అనుసంధానం చేసి అడవుల్లోకి వదలడం.. తిరిగి ఆ కుక్క ఇంటికి చేరి క్రమంలో తీవ్ర అలసటకు గురై చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. దాదాపు 8 రోజులు దాటుతోంది జ్ఞానేశ్వరి అదృశ్యమై. వందలాది మంది పోలీసులు అదే పనిగా వెతుకులాట చేస్తున్నారు. రకరకాల అనుమానాలు, భిన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ముమ్మర దర్యాప్తు చేపట్టాలని కాకినాడ ఎస్పీని ఫోన్లో ఆదేశించారు.
* మూఢనమ్మకాలపై అనుమానాలు.. అయితే పాప కోసం వెతుకులాట జరుగుతున్నా ఆచూకీ లేకపోవడంతో.. అనుమానాలు, అమావాస్య మూఢ నమ్మకాల కోణాలపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. పాపా దృశ్యం వెనుక క్షుద్ర పూజలు, అమావాస్య లేదా ఇతర మూఢ నమ్మకాల ప్రభావం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొంతమంది జ్యోతిష్యులు, ఆస్ట్రాలజిస్టులు బాధిత కుటుంబాన్ని ఆశ్రయించారు. చిన్నారి ధరించిన వెండి వస్తువుల ద్వారా జ్ఞానేశ్వరి ఆచూకీ కనుగొనవచ్చు అని చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
* ప్రముఖుల పరామర్శ..
చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబానికి అందరి నుంచి మద్దతు లభిస్తోంది. వీలైనంత త్వరగా ఆ చిన్నారి ఆచూకీ దొరకాలని ప్రతి ఒక్కరూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించారు. నేరుగా కాకినాడ ఎస్పీకి ఫోన్ చేసి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 400 మంది పోలీసులు జల్లెడ పడుతున్నారని ఎస్పీ పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఎస్ టిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని పవన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు బాధిత కుటుంబాన్ని నటి కరాటే కళ్యాణి పరామర్శించారు. కేసు వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ప్రజలు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. తల్లిదండ్రులకు ధైర్యం చెబుతున్నారు.
