Cyber crime : అమ్మాయి ఫోటోలు పంపి టెంప్ట్ చేసింది.. సాంతం నాకేసింది.. మ్యాట్రిమోనీ పేరిట మోసం!

సమాజంలో రకరకాల మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. టెక్నాలజీ మాటున ఇవి పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా వివాహ సంబంధాల పేరిట సరికొత్తగా బయటపడుతున్నాయి. విద్యాధికులు, చదువుకున్నవారే బాధితులుగా మిగులుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Written By: Dharma, Updated On : July 25, 2024 1:30 pm
Follow us on

Cyber crime : వివాహ పరిచయ వేదికలు, మ్యాట్రిమోనీ ల పేరిట మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. చదువుకున్నవారే బాధితులుగా మిగులుతున్నారు. లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా విశాఖకు చెందిన ఓ యువకుడు ఇట్టే మోసపోయాడు. అతడి వద్ద నుంచి లక్షలకు లక్షలు గుంజుకుంది ఓ మహిళ. తీరా మోసం అని తెలుసుకున్న సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. చివరకు ఆమె పోలీసులకు చిక్కింది. విశాఖకు చెందిన యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ఆయనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో ఓ మ్యాట్రిమోనీని ఆశ్రయించారు. అతడు రిక్వెస్ట్ పెట్టడానికి గమనించిన ఓ మహిళ ఇన్ స్టాలో అతనితో పరిచయం పెంచుకుంది. అతడి వాట్సాప్ నెంబర్ తెలుసుకొని అందమైన అమ్మాయిల ఫోటోలను పెట్టి అది తనే అన్నట్టు నమ్మించింది. మనోడు కూడా నిజమేనని భావించాడు. రోజూ ఇద్దరి మధ్య చాట్ నడుస్తోంది. ఆ యువకుడు తనకు సంబంధించి వ్యక్తిగత విషయాలు కూడా ఆ మహిళకు చెప్పాడు. అతడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించింది మహిళ. ఆ తరువాత కట్టు కథలు మొదలు పెట్టింది. తనకు డబ్బులు అత్యవసరంగా కావాలని చెప్పింది. అతడు కూడా నిజమని నమ్మి ఆమెకు డబ్బులు ఇవ్వడం ప్రారంభించాడు. రకరకాల కారణాలు చెబుతూ ఏకంగా రూ. 22 లక్షలు తన అకౌంట్ లో వేయించుకుంది. తరువాత ముఖం చాటేసింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది.

* పెళ్లి పేరు చెబితే ముఖం చాటేసింది
పెళ్లి చేసుకుందాం అని యువకుడు ప్రశ్నిస్తే సదరు మహిళ నుంచి రకరకాల సమాధానం వచ్చేది. పొంతన లేని మాటలు వచ్చేవి. కుటుంబ బాధలను చెప్పుకొని ఆమె మరింత సొమ్ము కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేసింది. కానీ మహిళ విషయంలో యువకుడికి అనుమానం వచ్చింది.వెంటనే ఆరా తీయడం ప్రారంభించాడు.దీంతో ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించేది. వెంటనే ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటివరకు 22 లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. హైదరాబాదులోని మాదాపూర్ తండాకు చెందిన సాయి ప్రియ గా గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

* ఇటీవల భారీగా మోసాలు
ఇటీవల వివాహ పరిచయ వేదికల పేరిట మోసాలు భారీగా జరుగుతున్నాయి. సంబంధిత మ్యాట్రిమోనీ నిర్వాహకులు ఇచ్చిన వివరాలతో..చాలామంది మోసాలకు పాల్పడుతున్నారు.అయినా సరే వీటిని నియంత్రించలేకపోతున్నారు. ప్రధానంగా విద్యాధికులు,చదువుకున్నవారే బాధితులుగా మారుతుండడం విశేషం.ఫోటోలు మార్ఫింగ్ చేయడం,తప్పుడు వివరాలతో దగ్గరవుతున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు.

* జాగ్రత్తలు అవసరం
మ్యాట్రిమోనీలో వివరాలు పొందుపరిచేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవతలి వారి వివరాలు పూర్తిస్థాయిలో తెలుసుకున్నాకే స్పందించాలంటున్నారు.బంధుత్వం,చుట్టరికం కలుపుకోవాల్సిన వారు ఆర్థిక విషయాల జోలికి వెళ్ళరని.. ఒకవేళ ఎవరైనా ఆర్థికపరమైన అంశాలను ప్రస్తావిస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే సాయం చేయాలని సూచిస్తున్నారు. అయితే మ్యాట్రిమోనీల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారిలో మహిళలే అధికం కావడం విశేషం. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఇటువంటి మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కానీ బాధితులు మాత్రం జాగ్రత్త పడటం లేదు.