Heartbreaking Incident in Siddipet: పాపం ఆ తండ్రి చలికి వణికిపోయాడు. ఉక్కపోతను భరించలేకపోయాడు. తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి కూడా లేదు. ఇటువంటి విపత్కర పరిస్థితుల మధ్య ఆదుకోవాల్సిన కొడుకు దూరం పెట్టాడు. అసలు ఆ తండ్రికి ఇటువంటి పరిస్థితి ఎదురు అవ్వడానికి ప్రధాన కారణం ఆ కుమారుడే. కుమారుడు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక.. కొట్టిన దెబ్బలు ఓర్చుకోలేక.. చివరికి ఆ తండ్రి పగవాడికి కూడా రాని కష్టాన్ని ఎదుర్కొన్నాడు. బంధువులకు.. కట్టుకున్న భార్యకు కన్నీటిని మిగిల్చాడు.
అది సిద్దిపేట జిల్లా.. సిద్దిపేట రూరల్ మండలంలోని కొల్లూరు గ్రామంలో గొడుగు పోచయ్య అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు . పోచయ్య తన పిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. తన భార్యతో కలిసి ఉంటున్నాడు. పోచయ్యకు అరెకరం పొలం ఉంది. ఆ పొలాన్ని ఉమ్మడిగానే ఉంచాడు పోచయ్య. ఆ పొలం విషయంలో పోచయ్యతో పెద్ద కుమారుడు గొడవ పడుతున్నాడు. కొంతకాలంగా ఈ భూమి విషయంలో పోచయ్యకు, పెద్ద కుమారుడికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద మనుషులు సర్ది చెప్పినప్పటికీ పోచయ్య కుమారుడు వినడం లేదు.
ఇటీవల పొలం విషయంలో తన తండ్రితో పెద్ద కుమారుడు గొడవపడ్డాడు. ఈసారి గొడవ మరింత పెద్దగా మారింది.. విచక్షణ కోల్పోయిన పెద్ద కుమారుడు తండ్రిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. దీంతో పోచయ్య తన భార్యతో కలిసి బయటికి వెళ్లిపోయాడు. బంధువులకు చెప్పినప్పటికీ.. కులస్తులతో చెప్పినప్పటికీ ఉపయోగం లేకుండా పోవడంతో రైతు వేదికలో తలదాచుకున్నాడు.. రాత్రి మొత్తం రైతు వేదికలో ఉండడంతో.. పోచయ్య మనసు కకావికలం అయిపోయింది. దీనికి తోడు తినడానికి తిండి లేక.. తాగడానికి నీరు లేక.. చలికి ఇబ్బంది పడి.. ఎండ వేడికి తట్టుకోలేక పోచయ్య కన్నుమూశాడు ఇంత జరిగినప్పటికీ పోచయ్య ను కడసారి కూడా చూసేందుకు పెద్ద కుమారుడు రాలేదు. చిన్న కుమారుడు పట్టించుకోలేదు దీంతో పోచయ్య భార్య యాదవ్వ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆమె బాధ తట్టుకోలేక.. ఆమె విలపిస్తుంటే చూడలేక బంధువులు ముందుకు వచ్చి పోచయ్య అంత్యక్రియలు నిర్వహించారు.
ఇటీవల హన్మకొండ జిల్లా ఎలకతుర్తి ప్రాంతంలో కొడుకు ఆస్తికోసం బయటికి పంపించాడు. కొడుకు ద్వారా అంతటి ఇబ్బందిని ఎదుర్కొన్న వ్యక్తి పేరు శ్యాంసుందర్రావు. ఆయన ఎలుకతుర్తి మండలానికి ఎంపీపీగా పని చేశారు. కొడుకుకు కొంతమేర ఆస్తి రాసి ఇచ్చినప్పటికీ.. మిగతా ఆస్తి కోసం కూడా అతడు ఆశపడుతున్నాడు.. ఈ క్రమంలోనే శ్యాంసుందర్రావు పై దాడి చేశాడు. కొడుకు నిర్వాకాన్ని తట్టుకోలేక శ్యాంసుందర్రావు తన వద్ద ఉన్న మిగతా ఆస్తిని మొత్తం ప్రభుత్వానికి రాసి ఇచ్చాడు. ఆస్తిలో స్కూల్ లేదా కాలేజీ నిర్మిస్తే తన భార్య పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించాడు.