Anantapur District Crime News: అనుమానం అనేది మనిషిని స్థిరంగా ఉంచదు. వారిలో రకరకాల ప్రతికూల ఆలోచనలను ప్రేరేపిస్తుంది. చివరికి దారుణాలకు పాల్పడే విధంగా నడిపిస్తూ ఉంటుంది. ప్రతికూల భావంతో చివరికి ఎంతటి ఘోరాల కైనా వారు పాల్పడుతూ ఉంటారు. ఆ సమయంలో తాను మనుషులమనే విషయాన్ని మర్చిపోయి.. మృగాల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. ఈ దారుణాలలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం భర్తలు. సూటిగా చెప్పాలంటే భర్తల చేతుల్లో వారు ప్రాణాలు కోల్పోయారు.
అనంతపురం జిల్లా కేంద్రంలోని నగరం బిందెల కాలనీ లో లక్ష్మీ గంగ, వీరాంజనేయులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఆరు సంవత్సరాల కుమారుడు, నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. లక్ష్మి, వీరాంజనేయులు ప్రేమించి పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. మొదట్లో వీరి సంసారం బాగానే నడిచింది. లక్ష్మీ ఇటీవల మరొక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తుందని వీరాంజనేయులు అనుమానించడం మొదలు పెట్టాడు. కొంతకాలం క్రితం నుంచి దంపతులిద్దరూ వేరువేరుగానే ఉంటున్నారు.. ఇటీవల పెద్ద మనుషులు పంచాయతీ చేశారు. దీంతో వీరాంజనేయులు లక్ష్మీని ఇంటికి తీసుకొచ్చాడు. లక్ష్మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి వీరాంజనేయులు మళ్లీ గొడవ పడడం మొదలుపెట్టాడు. ఆవేశంలో లక్ష్మిని కత్తితో నరికాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ముద్రాసి కాలనీలో కుళ్లాయమ్మ, మారెన్న దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. మారెన్న లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. మారెన్న కొద్దిరోజులుగా భార్య మీద అనుమానం పెంచుకున్నాడు.. అనంతపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. ఇటీవల కుళ్లాయమ్మ సంక్రాంతి పండుగకు పుట్టింటికి వెళ్ళింది. మారెన్న కూడా అత్తింటివారికి వెళ్ళాడు. అక్కడ ఇద్దరికీ గొడవైంది. ఆరోజు రాత్రి కుళ్లాయమ్మను మారెన్న విచక్షణ రహితంగా నరికాడు. కుటుంబ సభ్యులు కుళ్లాయమ్మను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.
వాస్తవానికి ఈ రెండు సంఘటనలు సమాజంలో మృగాల మాదిరిగా ప్రవర్తిస్తున్న కొంతమంది భర్తల తీరును తేట తెల్లం చేస్తున్నాయి. వాస్తవానికి అనుమానం అనేది ఒక రోగం లాంటిది. అది ఒకసారి మగాడిలో ఆవహిస్తే.. ఇక ఏం చేసినా ఉపయోగం ఉండదు.